అల్లరి నరేష్.. తెలుగు సినిమా హీరోల్లో అతని శైలే వేరు. అల్లరి సినిమాతో హీరోగా మారిన నరేష్, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. కామెడీ చిత్రాల హీరోగా ఇప్పటి వరకూ యాభైకి పైగా సినిమాలు చేసిన ప్రేక్షకులకి కడుపుబ్బా నవ్వించిన నరేష్, తన పంథా మార్చుకుని సీరియస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటివరకూ తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఈ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని చెబుతున్నాడు.

 


నాంది అనే సినిమాతో తన కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాడు. 57వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ పాత్ర చాలా అమాయకంగా ఉండనుందట. అమాయకుడైన హీరోని తన తప్పేమీ లేకుండానే పోలీసులు  అరెస్ట్ చేస్తే, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్నదే సినిమా కథగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఎవ్వరూ మేకప్ వేసుకోలేదట. సినిమాలో పాత్రలు చాలా నేచురల్ గా కనిపించాలన్న ఉద్దేశ్యంతో తనతో పాటు ఎవ్వరూ మేకప్ లేకుండానే నటించారట.

 

అయితే ఈ సినిమా నుండి ఇప్పటి వరకూ రెండు పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఆ రెండింట్లోనూ నరేష్ న్యూడ్ గానే కనిపించాడు. మొన్నటికి మొన్న రిలీజ్ చేసిన పోస్టర్లో పోలీస్ స్టేషన్లో పోలీసులు తనని కొడుతున్నట్టుగా కనిపించాడు. ఆ పోస్టర్లో తన ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. అయితే ఇలాంటి పోస్టర్స్ రిలీజ్ చేయడానికి కారణం ఉందట. అల్లరి నరేష్ సినిమా అనగానే కామెడీ ఉంటుందని నమ్ముతారు.

 

అలాంటి వారిని ముందే ప్రిపేర్ చేయడానికి అన్నట్లు ఈ సినిమా పూర్తిగా సీరియస్ గా సాగుతుందని తెలియజేయడానికే అలాంటి పోస్టర్లు వదిలారట. మరి నాంది సినిమాతో హిట్ దక్కించుకుంటాడేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: