ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బీభతమైన వర్షాలు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా అస్సాం, బిహార్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో భారీగా వర్షాలు పడటంతో చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లాయి. దాంతో ఎంతో ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది.  ఓ వైపు ప్రభుత్వాలు ఎన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నా..బాధితుల ఆర్తనాదాలు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. తాజాగా హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు తన మంచి మనసు చాటుకున్నారు.  తాజాగా ఆయన నటించిన ‘కొబ్బరిమట్ట’ మంచి హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. సంపూర్ణేష్ బాబు కర్ణాటక వరద బాధితులకు చేయూతగా నిలిచారు.

కర్ణా టక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 లక్షలు విరాళం అందిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో కూడా సంపూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైజాగ్ లో తుఫాన్ బీభత్సానికి అతలాకుతలం కాగా, తన మంచి మనసుతో  విరాళం ప్రకటించారు. కాగా,  కర్ణాటకలో 2,738 గ్రామాలు వరదల ప్రభావంతో నష్టపోయాయి. 40, 523 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సహాయక చర్యల్లో అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. అయితే కర్ణాటకలో వరదల కారణంగా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి తన మనసు చలించిందని పేర్కొంటూ ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

'ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేశాయి. కన్నడ ప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా 'హృదయ కాలేయం' నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వారు పడుతున్న కష్టాల ఫొటోలు చూసి చాలా బాధపడ్డా. నా వంతుగా రూ.2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటిస్తున్నాను' అని సంపూ పోస్ట్‌ చేశారు.  సంపూ నటించిన 'కొబ్బరిమట్ట' సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మన్మథుడు2, కథనం సినిమాలు రిలీజ్ అయినా పెద్దగా టాక్ తెచ్చుకోకపోవడంతో ‘కొబ్బరిమట్ట’కు మంచి ఆదరణ పెరిగిపోయింది. చిన్న హీరో అయినా మంచి మనసు చాటుకున్న సంపూర్ణేష్ బాబు మంచి తనాన్ని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: