విక్టరీ
వెంకటేష్ ముందు నుంచి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా ప్రతి జోనర్లోనూ సినిమాలు చేశారు. ఎఫ్-2 తో భారీ సక్సస్ ను అందుకున్న వెంకీ తన మేనల్లుడు అక్కినేని
నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరోసారి యాక్షన్ సినిమాలో నటించబోతున్నారు. ఒకప్పుడు హీరోలు యాక్షన్ స్టంట్స్ ను డూప్‌ల సహాయంతో చేసేవారు. ఆ తరవాత డూప్‌లపై ఆధారపడటం చాలావరకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలోని యంగ్ హీరోలంతా స్టంట్స్ స్వయంగానే చేస్తున్నారు. దాని కోసం శిక్షణలు కూడా తీసుకుంటున్నారు. వీటితో పాటు హీరోలు గుర్రపు స్వారీ కూడా చేయాల్సి వస్తోంది. 'మగధీర', 'బాహుబలి' సినిమాల తర్వాత మనం కూడా గుర్రపు స్వారీ చేస్తే బాగుంటుందే అన్న ఆలోచన సీనియర్ హీరోల్లో కలిగింది. ఇప్పటికే
బాలకృష్ణ (గౌతమీపుత్ర శాతకర్ణి), చిరంజీవి (సైరా లో) ఆ కోరికను తీర్చేసుకున్నారు. ముఖ్యంగా ఈ గుర్రపు స్వారీ చిరుకి ముందునుంచి అలవాటే. కొండవీటి దొంగ, కొదమసింహం సినిమాలలో చేసిన గుర్రపు స్వారీ అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ వరుసలో నిలవడానికి విక్టరీ
వెంకటేష్ రెడీ అవుతున్నారు.
'పెళ్ళి చూపులు' సినిమాతో టాలీవుడ్ లో ఫేమస్ అయిన
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో
వెంకటేష్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో
వెంకటేష్ హార్స్ రైడర్‌గా కనిపించనున్నారని లేటెస్ట్ న్యూస్. ఈ యాక్షన్ సినిమా కోసం ఇప్పుడు వెంకీ హార్స్ రైడింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. అయితే, ఈ విషయంలో
వెంకటేష్ రిస్క్ చేస్తున్నారని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది కామెంట్ చేస్తున్నారు. వెంకటేష్ మోకాలి గాయంతో బాధపడుతున్నారు. కాబట్టి, ఆయనకు హార్స్ రైడింగ్ మంచిది కాదని అంటున్నారు.
వాస్తవంగా అయితే సినిమాలో
వెంకటేష్ హార్స్ రైడింగ్ చేస్తున్నట్టు కనిపించడానికి ఇలా రిస్క్ చేయాల్సిన అవసరంలేదు. మనకు ఎలాగూ వీఎఫ్ఎక్స్ అందుబాటులో ఉన్నాయి. 'మణికర్ణిక' సినిమాలో కంగనా రనౌత్ చేసింది కూడా ఇదే. ఆమె నిజంగా గుర్రంపై కూర్చొని యుద్ధ పోరాటాలు చేయలేదు. ట్రాలీ మీద గుర్రపు బొమ్మ పెట్టి.. దాని మీద కంగనాను కూర్చోబెట్టి.. కారుకి తాడు కట్టి లాగారు. దాన్ని వీఎఫ్ఎక్స్ సాయంతో కంగనా గుర్రపు స్వారీ చేసినట్టు సినిమాలో చూపించారు. ఆ విషయం ప్రేక్షకులకు తెలిసే ప్రసక్తే లేదు. అంత అద్భుతంగా వీఎఫ్ఎక్స్ చేశారు. ఇప్పుడు మన వెంకీ కూడా ఇలానే కంగనా ను ఫాలో అయితే సరిపోతుందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.