సూపర్ స్టార్ మహేష్ బాబు  'సరిలేరు నీకెవ్వరు' అంటుంటే..  అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' అంటూ ఇద్దరూ ఒకేరోజున  జనవరి 12న పోటీ పడుతున్నారు.  మొత్తానికి ఈ పోటీ కారణంగా సంక్రాంతికి రావల్సిన  ఓపెనింగ్స్ దెబ్బతింటాయని బయ్యర్లు కంగారుపడిపోతున్నారు.  ఇక ఆయా హీరోల అభిమానుల సంగతి చెప్పనక్కర్లేదు.  ఎవరికి వారు తమ హీరో సినిమానే హిట్టవ్వాలని ప్రార్థిస్తున్నారు. అయితే  ఇంతకుముందు చాలాసార్లు నిర్మాతల మధ్యన జరిగే సర్దుబాట్ల కారణంగా  పండక్కి భారీ చిత్రం ఒకే ఒక్కటి విడుదలయ్యేది.  దాంతో ఆసక్తి ఉన్నా లేకపోయినా ఒకసారి చూసిన సినిమానే రెండోసారి చూడాల్సి వచ్చేది. కానీ ఈసారి  ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు దిగుతున్నాయి.  రెండు రోజులు రెండు కొత్త సినిమాలు చూసే అవకాశం దొరికింది.  అందుకే వసూళ్ల మధ్య పోటీ ఉంటుందని తెలిసినా రెండూ ఒకేసారి వస్తే..  బాగున్న సినిమానే ఆడుతుంది.  ఒకవేళ రెండూ బాగుంటే రెండూ ఆడుతాయి. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో..? చూడాలి.  అయితే ముందుగా 'అల వైకుంఠపురంలో' నిర్మాతలు జనవరి 12న వస్తున్నట్టు ప్రకటించగానే ఏమాత్రం ఆలస్యం లేకుండా అదే 12ను విడుదల తేదీగా అనౌన్స్ చేశారు 'సరిలేరు నీకెవ్వరు' నిర్మాతలు.  దీంతో క్లాష్ మొదలైంది. 

 సాధారణంగా మహేష్ వసూళ్లను దెబ్బతీసే ఇలాంటి పోటీకి దూరంగానే ఉంటారు.  అలాంటిది ఈసారి హెడ్ టు హెడ్ అన్నట్టు ఆయనే బరిలోకి దూకడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.  ఇండస్ట్రీ టాక్ మేరకు మహేష్ 12వ తేదీన రావాలని పట్టుబట్టడానికి కారణం, లెక్క తప్పితే తీవ్ర నష్టమని తెలిసినా వెనుకాడకపోవడానికి రీజన్ దర్శకుడు అనిల్ రావిపూడేనట.  అనిల్ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం చూసి ఎట్టి పరిస్థితుల్లో సినిమా బాగుంటుందని మహేష్ ఫిక్స్ అయిపోయారట.  పైగా సినిమా ఎంటెర్టైనింగ్ జానర్.   అనిల్ రావిపూడి గత సంక్రాంతి సీజన్లో 'ఎఫ్ 2' సినిమాతో వచ్చి పెద్ద సినిమాలనే అధిగమించి తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు.  ఆ చిత్రంతో ప్రేక్షకుల్లో ఆయనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది.  ఈ కారణాలే మహేష్ అతని మీద ఇంత నమ్మకం ఎర్పరుచుకునేలా చేసి ఉండవచ్చు.  మరి సూపర్ స్టార్ నమ్మకాన్ని రావిపూడి ఎంతమేరకు నిలబెట్టుకుంటారో చూడాలి. అయితే   బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై కూడా  భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ,   ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో  రాబోతున్నారు. ఈ సినిమా కూడా హిట్ పక్కా అంటున్నారు.  హీరోలు కూడా ఇదే ఫీలింగ్ లో ఉన్నారు. మొత్తానికి  మహేష్,  బన్నీ ఎవరి నమ్మకం వారిదన్నట్లు ఉంది వ్యవహారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: