అప్పటికే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున అన్నమయ్య సినిమాలో నటించి ఆంధ్ర ప్రదేశ్ లో అందర్నీ తన వైపుకు తిప్పుకున్నారు. నాగార్జున నటన, దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన తీరు అన్నమయ్య సినిమాను తెలుగువారు చిరకాలం గుర్తించుకునే విధంగా తీర్చిదిద్దాయి. తరువాత వీరి కలయికలో మరో భక్తి కథా చిత్రం శ్రీరామదాసు వచ్చింది. ఈ సినిమా కూడా తెలుగు వారిని అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు వీరి కలయికలో రూపుదిద్దుకున్న మూడవ భక్తి కథా చిత్రం శిరిడి సాయి. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల నేపథ్యం శిరిడి సాయి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డానికి ఒక ముఖ్యకారణమైతే, తెలుగు వారిలో ఎక్కువ సంఖ్యలో నమ్మే సాయిబాబా సినిమా కావడం, అలాగే గత రెండు చిత్రాలలో భక్తుడిగా మెప్పించిన నాగార్జున ఈ సారి దేవుడిగా నటిస్తుండటం ఈ శిరిడి సాయి సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డానికి ఇతర ప్రధాన కారణాలు. ఇక కీరవాణి స్వరపరిచిన పాటలు ఇటు సినిమా అభిమానులు, అటు సాయి భక్తులను శిరిడి సాయి సినిమా కోసం ఎదురుచూసేలా చేశాయి. మరి ఇన్ని అంచనాలతో వచ్చిన శిరిడి సాయి సినిమా ఎలా ఉందో చూద్దాం..! చిత్ర కథ : శిరిడి సాయి చిత్రం పేరే చెబుతుంది ఈ సినిమా కథను. శిరిడి లో వెలసి భక్తులకు కల్పవృక్షంగా మారిన సాయి బాబా యొక్క అవతార నేపథ్యాన్ని, సాయి బాబా భక్తులను ఆకట్టుకున్న విధానాన్ని, ప్రదర్శించిన మహిమల్ని, సాయిబాబా ఆశయాల్ని, సాయిబాబా తన అవతారాన్ని ఏ విధంగా చాలించారు.. అనే విశేషాలతో ఈ శిరిడి సాయి సినిమా సాగుతుంది. నటీనటుల ప్రతిభ : ఈ శిరిడి సాయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నాగార్జున ఓ కొత్త సాయిబాబా ను చూపించాడు. సాయిబాబా డాన్సులు చేయడం ఈ శిరిడి సాయిలో నాగార్జున చూపించిన ఓ కొత్త ప్రత్యేకత. ఇక ఈ సినిమాలో నాగార్జున చక్కటి నటన కనబరిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సాయిబాబా గా నాగార్జున నటన బాగుంది. బాబా భక్తులగా శ్రీకాంత్, శరత్ బాబు ఆకట్టుకున్నారు. సాయిబాబాను మొదటగా ద్వేషించి తరువాత భక్తులుగా మారే పాత్రలలో షయజీ షిండే, శ్రీహరి నటించారు. అలీ, బ్రహ్మనందం నవ్వించడానికి కృషి చేశారు. మిగిలిన వారు తమతమ పాత్రలలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. పాటలు బాగున్నాయి. ఇక మాటలు విషయానికి వస్తే దర్శకుడికి జి.కె.భారవి లేని లోటు ఈ సినిమాలో స్పష్టంగా కనిపించింది. అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలకు మాటలు ఓ ప్రత్యేక బలం. అలాంటి బలాన్ని పరుచూరి బ్రదర్స్ శిరిడి సాయి సినిమాలో దర్శకుడికి ఇవ్వలేకపోయారు. నేరుగా హృదయానికి తాకే మాటలు ఈ సినిమాలో లేవు. నిర్మాతలు బాగా ఖర్చుపెట్టారు. ఇక దర్శకుడి విషయానికి వస్తే ఎన్నో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తన సత్తా చాటుకున్న దర్శకుడు రాఘవేంద్రరావు. అయితే కె.రాఘవేంద్రరావు రూపొందించిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు అతనికి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకుని వచ్చాయి. దీంతో శిరిడి సాయి సినిమా గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. దాదాపు గా అందరికి తెలిసిన సాయిబాబా జీవిత కథను తెరకెక్కించడం కొంచెం కష్టమైన పనే. బాపు బొమ్మల సహాయంతో సాయి బాబా పుట్టుక నేపథ్యాన్ని వివరించిన దర్శకుడు సాయిబాబా (నాగార్జున) పరిచయ సన్నివేశాలను చక్కగా చూపించారు. అయితే సినిమా మొత్తాన్ని అంతే ఆస్తకికరంగా మలచడంలో విఫలమయ్యారు. దీంతో చివరిలో ఈ సినిమాను నాగార్జున తన భుజాల మీద మొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణ వ్యక్తులను కూడా తమ అన్నమయ్య సినిమాతో వేంకటేశ్వర స్వామి భక్తులుగా మార్చిన నాగార్జున, కె.రాఘవేంద్రరావుల జోడి ఈ శిరిడి సాయి సినిమాతో సాధారణ సాయిబాబా భక్తులను కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. హైలెట్స్ : నాగార్జున నటన, కీరవాణి పాటలు, ముగింపు సన్నివేశాలు. డ్రాబ్యాక్స్ : అందరికీ తెలిసిన కథ, సాధారణంగా సాగే సన్నివేశాలు. చివరగా : సాయిబాబా భక్తులే ఈ శిరిడి సాయి సినిమా ఫలితాన్ని నిర్ణయించాలి.   షిర్డీ సాయి టీం: బ్యానర్ : సాయికృపా ఎంటర్ టైన్ మెంట్ (ప్రై) లిమిటెడ్; నిర్మాత : ఎ.మహేష్ రెడ్డి, సంగీతం : ఎం.ఎం.కీరవాణి దర్శకత్వం : కె.రాఘవేంద్ర రావు నటీనటులు : నాగార్జున, శ్రీకాంత్, శరత్ బాబు షయాజీ శిండే, తదితరులు for engilsh review:     http://bit.ly/NUhzsJ More articles on Shirdi Sai:   http://bit.ly/OyF5wb Enjoy Shirdi Sai Images:       http://bit.ly/QXv4YW Watch Shirdi Sai Videos:       http://bit.ly/Oue3Yl     

మరింత సమాచారం తెలుసుకోండి: