హిందీ సినిమాలో న‌టించడం ఓ క‌ల‌. ఆ క‌ల ఎప్పుడు సాకారం అవుతుందా అంటూ ప్రతీ క‌థానాయికా ఎదురు చూస్తూ గ‌డుపుతుంటుంది. నిర్మాత‌లు, ద‌ర్శకుల చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేస్తూ ఉంటుంది. కానీ న‌య‌న‌తార మాత్రం అలాంటి అవ‌కాశాలు వచ్చిన ప్రతిసారీ వదిలేసుకొంటోంది. అస‌లు హిందీలో న‌టించ‌డం నాకు అంత ముఖ్యం కాద‌ని చెబుతోందంద‌ట‌. ఇటీవ‌ల షాహిద్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కనున్న ఓ సినిమాలో అవ‌కాశం వ‌చ్చినా కాద‌నుకొంద‌ట‌. తీసుకొన్న అడ్వాన్సును తిరిగి ఇచ్చేసింద‌ట‌.

ప్రభుదేవాతో ప్రేమ‌బంధానికి పుల్‌స్టాప్ ప‌డ్డాక... న‌య‌న‌తార హిందీకి వెళ్లాల‌ని ప్రయ‌త్నించింది. ప్రభుకి ధీటుగా అక్కడ అవ‌కాశాలు అందుకొని స‌వాల్ విస‌రాల‌ని ప్రయ‌త్నించింది. ఇలా వ‌స్తున్నానంటూ క‌బురు పంపగానే ఈ ముద్దుగుమ్మకి ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. ఎందుకో తెలియ‌దు కానీ.. ఉన్నట్టుండి ఆ ప్రయ‌త్నాన్ని విర‌మించుకొంది. వ‌చ్చిన అవ‌కాశాల్ని వ‌ద్దనుకొంది.

ప్రస్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న న‌య‌న్‌... ఆ మ‌ధ్య షాహిద్‌క‌పూర్‌తో సినిమా చేయ‌డానికి టిప్స్ సంస్థ నుంచి అడ్వాన్స్ తీసుకొంది. అయితే ఆ సినిమా ప్రారంభం కావ‌డానికి బాగా స‌మ‌యం ప‌ట్టింది. దీంతో న‌య‌న్ త‌న మ‌న‌సు మార్చుకొని ఆ అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చింద‌ట‌. ద‌క్షిణాదిలోనే కొన‌సాగాల‌ని నిర్ణయించుకొంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: