మాస్ హీరో గోపిచంద్ బాక్సాఫీస్‌పై తన పంతం నెగ్గించుకొంటున్నారు. గోపిచంద్ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకోవడం ట్రేడ్, క్రిటిక్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సున్నితమైన రాజకీయ విమర్శనాస్త్రంతో చక్కటి సందేశాన్ని ఇచ్చిన పంతం చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆకర్షిస్తున్నది. గత కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్‌కు ‘పంతం’ మంచి రిలీఫ్ ఇచ్చింది. సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ ప్రభావం వసూళ్లపై పడలేదు.

సినిమాకు మంచి ప్రచారం చేయడం, ట్రైలర్‌లో సోషల్ మెసేజ్‌తో కూడిన డైలాగులు ఉండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. కామెడీ, యాక్షన్, సోషల్ మెసేజ్ కలగలిపిన సినిమాతో గోపీచంద్ ప్రేక్షకులను బాగానే ఎంటర్‌టైన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు రోజుల్లో రూ. 10.5 కోట్ల గ్రాస్, రూ.6.77 కోట్ల షేర్‌ను ఈ చిత్రం సాధించింది. మెహ్రీన్ ఫిర్జాదా, సంపత్ రాజ్, ముఖేష్ రుషి, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రం వినోదంతోపాటు సామాజిక సందేశాన్ని అందించింది.

తొలి చిత్ర దర్శకుడు కే చక్రవర్తి రూపొందించిన ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ తన 25వ సినిమాతో ఈ ఫీట్‌ను సాధించాడు. రచయిత కె.చక్రవర్తి దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.6 కోట్ల షేర్ సాధించింది. ప్రాంతాల వారీగా చూసుకొంటే నైజాంలో రూ.1.96 కోట్లు, సీడెడ్‌లో రూ.1.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.83 లక్షలు వసూలు చేసింది.

ఆంధ్రంలోని నెల్లూరులో రూ.26 లక్షలు, గుంటూరులో రూ.64 లక్షలు, కృష్ణా రూ.43 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ. రూ.37.28 లక్షలు, తూర్పు గోదావరిలో రూ.46.42 లక్షలు వసూలు చేసింది. మెహ్రీన్ గ్లామర్ కూడా సినిమాకు బాగానే కలిసొచ్చింది. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడం కూడా ‘పంతం’కు కలిసొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: