మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక సినిమా సైరా కోసం నిర్మాత రామ్ చరణ్ భారీ బడ్జెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  సినిమా ఆద్యంతం భారీ యుద్ధ సన్నివేశాలు సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయన్న సమాచారం ఉంది. అందుకు తగ్గట్టే సురేందర్ రెడ్డి బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.  ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. చారిత్రక చిత్రం కావటంతో నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు.  ఒకప్పుడు రూ.20 నుంచి రూ.30 కోట్లు రూపాయల బడ్జెట్ అంటే వామ్మో అనుకునేవారు. 


పెద్ద హీరోల సినిమాలకు అంతవరకు ఖర్చు పెట్టేవారు.  బాహుబలి తరువాత అంకెలు మారిపోయాయి.  భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు సమాయత్తం అవుతున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగు 'జార్జియా'లో జరుగుతోంది. దాదాపు 20 రోజుల పాటు అక్కడ భారీస్థాయిలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జార్జియాలోని సువిశాలమైన ప్రాంతంలో ఈ యుద్ధ సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఆ మద్య నాన్న కళ్లలో ఆనందం చూసేవారకూ ఎంత బడ్జెట్ అయినా పెడుతామని టైటిల్ లాంచ్ వేడుకలో చరణ్ బహిరంగంగానే ప్రకటించారు.


నాన్న(చిరు)కు అమ్మ (సురేఖ) ఇస్తున్న కానుక ఇదని తెలిపారు. అందుకు తగ్గట్టే ప్రస్తుతం ఓ వార్ సీన్ కోసం భారీ బడ్జెట్ తో తీయబోతున్నట్లు సమాచారం. వందలాది గుర్రాలతో వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. అక్కడ చిత్రీకరించే ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.


బ్రిటీష్ కాలం నాటి కథ కావడం వలన విదేశీ ఆర్టిస్టులు పెద్దసంఖ్యలో అవసరం కావడంతో అక్కడ ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ 20 రోజుల షూట్ కోసం రామ్ చరణ్ ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తున్నది.  ఖర్చు ఏ మాత్రం వెనకాడవద్దని, పోరాట దృశ్యాలు అద్భుతంగా చిత్రీకించాలని దర్శకుడు సురేందర్ రెడ్డికి చరణ్ చెప్పాడట.  నిర్మాత చరణ్ ఇచ్చిన ధైర్యంతో దర్శకుడు ముందుకు అడుగు వేస్తున్నట్టు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: