గత కొన్ని రోజులుగా ఉత్తారాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.  భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.  భారీ వర్షాలు కారణంగా కులు, మనాలీలోని బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పర్యాటకుల బస్సు బియాస్ నదిలో కొట్టుకుపోయింది. అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.  అయితే వరద కష్టాలు సామాన్యులకు మాత్రమే కాదు.. సెలబ్రెటీలకు కూడా చిక్కులు తెచ్చి పెట్టాయి.  కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కుతున్న దేవ్‌ చిత్ర యూనిట్‌ వరదల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలిలో జరుగుతుంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు చిత్ర బృందం షూటింగ్‌ను రద్దు చేసుకుంది.   


రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 50 కోట్ల బడ్జెట్ తో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం 'కులుమనాలి'లో జరుగుతోంది. కొన్ని రోజులుగా అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతుండటం వల్ల వారు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 


నిర్మాత లక్ష్మణ్‌కు దాదాపు కోటిన్నర రూపాయల నష్టం వాటిలినట్టు తెలుస్తోంది. వారికి ప్రస్తుతానికి తినడానికి ఏం దొరకడం లేదని తెలుస్తోంది. ‘మంచు కురిసేటప్పుడు కొన్ని సీన్లు చిత్రీకరించడానికి.. మేము ఇక్కడికి వచ్చాం. మాకు ఇక్కడున్న వాతావరణం కూడా చాలా బాగా కుదిరింది. ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీచేయలేదు. నిన్నటి వరకు పరిస్థితి బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటం ప్రారంభమైంది.  నేను కారులోనే నాలుగైదు గంటలు కూర్చుండిపోయాను. తర్వాత దగ్గరలోని ఓ గ్రామానికి వచ్చాను. 


కొండపై భాగంలో ఈ చిత్రానికి పనిచేస్తున్న 140 మంది ఎటువంటి కమ్యూనికేషన్‌ లేకుండా చిక్కుకుపోవడం బాధగా ఉంద’ని కార్తీ ఓ ప్రకటనలో తెలిపారు.  ఇంతకుముందు కార్తీ .. రకుల్ కాంబినేషన్లో వచ్చిన 'ఖాకీ' భారీ విజయాన్ని సాధించింది. దాంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ  సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్‌ జయరాజ్‌ సంగీతమందిస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: