టాలీవుడ్ లో ఎన్నో క్యారెక్టర్ పాత్రలతో మెప్పించిన నటుడు వైజాగ్ ప్రసాద్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు.   గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది.  నేటి తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు.    టెలివిజన్ రంగంలో తన ప్రస్థానం మొదలు పెట్టిన వైజాగ్ ఎన్నో సీరియల్స్ లో నటించారు.  ఆ తర్వాత కొన్ని వందల సినిమాల్లో ఆయన రక రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.   వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. వైజాగ్ లోని గోపాలపట్నం ఆయన స్వగ్రామం. వైజాగ్‌ నుంచి వచ్చారు కాబట్టి వైజాగ్‌ ప్రసాద్‌గా స్థిరపడిపోయింది.

ప్రసాద్‌ తండ్రి ఉపాధ్యాయుడు... తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిల తర్వాత నాలుగో సంతానంగా జన్మించారు. ఊహ తెలియక ముందే తల్లి కన్నుమూసింది. మేనమామ దగ్గరుండి ఎస్‌ఎస్‌ఎల్‌సీ దాకా చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో నటించేవారు. నాటకాల పిచ్చితో అగ్రికల్చర్‌ బీఎస్‌సీ సీటు, ఎంబీబీఎస్‌ సీటు పోగొట్టుకున్నారని సమాచారం.  1983లో వచ్చిన బాబాయ్‌ అబ్బాయ్‌ నటుడిగా ఆయన మొదటి సినిమా.  వైజాగ్ ప్రసాద్, తేజ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నేను'లో హీరో ఉదయ్ కిరణ్ తండ్రి పాత్రను పోషించి, మెప్పించిన తరువాత, వరుసగా అవకాశాలను పొందారు.  భద్ర, జై చిరంజీవ, గౌరీ, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌ లాంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి. 

వైజాగ్ ప్రసాద్‌ భార్య విద్యావతి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. రత్నప్రభ, రత్నకుమార్. ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లు. కూతురు అమెరికాలో నివాసం ఉండగా అబ్బాయి లండన్ లో ఉంటున్నాడు. వీరిద్దరు వైజాగ్ చేరుకొన్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.  వైజాగ్ ప్రసాద్ దాదాపు 50కి పైగా చిత్రాల్లో, పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించాడు.  'మా' తరపున వైజాగ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు 'మా' అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ డా. వి.కె. నరేష్   ప్రగాఢ సానుభూతి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: