24 కిస్సెస్ సినిమా మీద బాగానే అంచనాలు పెరిగి పోయాయి. ఆ సినిమా లో ముద్దులు ఎక్కువగా ఉండటం తో కుర్ర కారు ఎగబడుతుంది. రిలీజ్‌కు ముందే ముద్దు సీన్లతో హడావిడి సృష్టించిన ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకున్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. ఫిల్మ్ మేకింగ్‌‌ను కెరీర్‌గా ఎంచుకొన్న మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ శ్రీలక్ష్మితో ప్రేమలో పడుతాడు. 

బలం, బలహీనత

కొన్ని కారణాల వల్ల పెళ్లి, పిల్లలకు దూరంగా ఉండాలనుకొంటాడు. సహజీవనంతోనే జీవితాన్ని చాలించాలనుకొనే మనస్తత్వం కలిగి ఉంటాడు. దాంతో ఆనంద్, శ్రీలక్ష్మీ మధ్య అపోహలు పెరిగి లవ్ బ్రేకప్ అవుతుంది. ఆనంద్, శ్రీలక్ష్మి బ్రేకప్ తర్వాత వారిద్దరూ మళ్లీ కలిశారా? శ్రీలక్ష్మి ప్రేమను పొందడానికి ఆనంద్ తన అభిప్రాయాలను ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఆనంద్ పెళ్లి చేసుకోకుండా ఉండటానికి బలమైన కారణమేమిటి? కథలో సైక్రియాటిస్ట్ రాంమూర్తి (రావు రమేష్) పాత్ర ఏంటి? సీనియర్ నటుడు నరేష్ ఎలాంటి పాత్రను పోషించాడు? అసలు 24 ముద్దుల వెనుక అసలు రహస్యం ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే 24 కిసెస్. 

తెర ముందు, తెర వెనుక

బ్రేకప్‌తో మానసిక సంఘర్షణకు గురైన ఆనంద్ తన స్నేహితుడైన సైక్రియాటిస్ట్ రాంమూర్తి వద్ద ట్రీట్‌మెంట్ రావడంతో కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. ఆనంద్, శ్రీలక్ష్మీ కెరీర్‌తో మొదలుపెట్టి లవ్ మ్యాటర్‌లోకి కథ చేరుకొంటుంది. తొలిభాగంలో పేలవ సన్నివేశాలు, ముద్దుల జడివాన మధ్య ప్రేక్షకుడు చిక్కిపోతాడు. అర్ధంపర్థం లేని రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో బాగానే సాగదీత కనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ కార్డు వేయాలి కాబట్టి బ్రేకప్ సీన్ పెట్టేసి తొలిభాగాన్ని ముగించేశాడు. తొలిభాగంలోనే విషయం లేదనే పరిస్థితి గ్రహించిన ప్రేక్షకులకు సెంకడాఫ్‌‌ను భరించడం భారంగానే కనిపిస్తుంది. సెకండాఫ్‌లోనైనా కథలో వేగం పెంచుతాడా అనే భావించిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. కథ ముందుకు, వెనుకకు వెళ్లే స్క్రిన్ ప్లే గందరగోళానికి గురిచేస్తుంది. ప్రేక్షకుడి సహనం నశించిన తర్వాత చక్కటి భావోద్వేగ అంశాన్ని చూపించి కథకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. దర్శకుడి తడబాటుతో సినిమా పరిస్థితి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొనే విధంగా మారింది. మొత్తం మీద ఈ సినిమా ముద్దుల కోసమే తీసినట్టుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: