మీ టూ ఉద్యమం నేపధ్యం లో కేట్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం తీవ్రమైన ఆరోపణలు చేసి ముంబై పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన హీరోయిన్ కేట్ శర్మ యూటర్న్ తీసుకొన్నది. నాలుగు రోజుల క్రితం సుభాష్ ఘాయ్‌పై చేసిన ఫిర్యాదును వెనుకకు తీసుకొన్నది. కేట్ శర్మ నిర్ణయంపై బాలీవుడ్‌లో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది. 

హీరోయిన్ కేసు వాపసు

కొద్ది రోజుల క్రితం సుభాష్ ఘాయ్‌పై ఆరోపణలు చేస్తూ.. నన్ను ముద్దు పెట్టుకొనేందుకు ప్రయత్నించాడు. కౌగిలిలో బంధించేందుకు చూశాడు. నా దేహంపై చెప్పరాని చోట తాకాడు. ఆయన ఇంటిలో ఓ రాత్రి గడపడానికి నిరాకరిస్తే బెదిరింపులకు పాల్పడ్డాడు అని కేట్ శర్మ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులవ్యవహారంలో కేట్ శర్మ ఫిర్యాదు మేరకు సుభాష్ ఘాయ్‌‌పై ముంబైలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే అనూహ్యంగా నాలుగ రోజుల క్రితం కేసు వాపసు తీసుకోవడం జరిగింది. జబ్బున పడిన నా తల్లి ఆరోగ్యాన్ని, నా ఫ్యామిలీని చూసుకోవాలి. ఈ కేసు నమోదుతో నా కుటుంబం ఆందోళనకు గురైంది అని కేట్ వివరణ ఇచ్చింది. 

కుటుంబానికి మానసిక వేదన

వాస్తవానికి నాకు జరిగిన చేదు అనుభవాన్ని నా కుటుంబానికి ఎప్పుడూ చెప్పలేదు. టీవీల్లో చూసి వారు ఆందోళనకు గురయ్యారు. కేసు వాపసు తీసుకోవాలని కోరారు. అందుకే సుభాష్ ఘాయ్‌పై చేసిన ఫిర్యాదును వెనుకకు తీసుకొన్నాను అని కేట్ శర్మ తెలిపారు. అలాగే మీ టూ ఉద్యమంపై కేట్ శర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మీ టూ ఉద్యమాన్ని చాలా మంది ఎగతాళి చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. చాలా మందిపై ఆరోపణలు వచ్చినా.. ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కనీసం విచారణ కూడా చేపట్టలేదు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా అని అడిగారు. అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో లాభం లేదని అనిపించింది. నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పాను. అదే నాకు చాలూ అని కేట్ శర్మ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: