రవితేజా అంటేనే మాస్ మహారాజా. ఆయన సినిమాలొ ఈ మధ్యవరకూ ఓ రేంజికో కిక్కు ఇచ్చేవే. ఆ వెటకారం డైలాగులు, పంచులు. తనదైన స్టైల్లో మ్యానరిజాలు ఇవన్నీ కలసి రవితేజా సినిమా అంటేనే చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ ఊపేశాయి. అయితే ఇపుడు మాత్రం రవితేజా దూకుడుకు బ్రేక్ పడింది.


కొత్తదనం ఏమీ లేని కధాంశం, రొటీన్ రొడ్డ కొట్టుడు సీన్లు, పగలు, ప్రతీకారాలు, అవే ఊకదంపుడు క్రియేషన్లు అన్నీ కలసి బాబోయ్ మాస్ మహరాజ్ అంటున్నారు జనం. అంతే కాదు, రవితేజా మూవీకి ఉండాల్సిన కిక్కు ఇపుడు ఎక్కడా కనిపించడంలేదని కూడా అంటున్నారు. రవి బాగా మారాలని, మొత్తం చేంజ్ రావాలని కూడా కోరుతుంటున్నారు. ఆయన ఎంచుకునే కధలు ఇప్పటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలని కూడా సలహాలు వస్తున్నాయి.


వీటిని పరిగణనలోకి తీసుకున్న రవితేజా తరువాత చేయబోయే చిత్రాల్లో వాటిని పూర్తిగా అమలు చేసే పనిలో ఉన్నాడట. ఇకపై మొహమాటాలకు పోయి సినిమాలు చేయడం, అలాగే  క్రేజీ కాంబోలను నమ్ముకోవడం, తన మార్క్ అంటూ పెట్టే కిచిడీ కామేడీని పక్కన పెట్టడం వంటివి రవి ఇపుడు చేస్తున్నాడట. వీటి వల్ల రవి కొత్త సినిమాలపై మళ్ళీ జనాలు ఆశలు పెంచుకోవచ్చుననిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే నిర్మాతలకు రవితేజా శుభవార్త ఒకటి వినిపించాడట. 


తన మార్కెట్ బాగా తగ్గడంతో నిర్మాతలకు సేఫ్ సైడ్ గా తన రెమ్యునరేషన్ ని సగానికి సగం తగ్గించుకోవడానికి మాస్ మహరాజ్ రెడీ అయ్యారట. అనధికార వర్గాల సమాచారం ప్రకారం రవితేజా మొత్తం 10 కోట్ల రూపాయలు వరకూ  తీసుకుంటారట. ఇపుడు తగ్గించిన దాని ప్రకారం 5 కోట్ల రూపాయలకే రవి సినిమా చేస్తారట. మరి నిర్మాతలకు ఇది హ్యాపీ న్యూసే. దీంతో పాటు మంచి కంటెంట్ తో రవి సినిమా ఉంటే మళ్ళీ ఫాం లోకి రావడం ఖాయమంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: