సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంటి పేరు చేంబోలు అన్న సంగతి ఎంతమందికి తెలుసు. అంతలా తన పేరుకు ముందు సిరిని, వెన్నెలను కట్టేసుకుని వెండి తెరపై నిరంతరాయంగా  పున్నమి వెన్నెలలు  కురిపించిన భావుకుడు. ఆయన పాటకు సంగీతం అవసరం లేదు. పదాలే సరిగమలు పలికిస్తాయి. ఆయన పాటకు నిఘంటువులు అవసరం లేదు. స్వచ్చమైన మనసుతో వింటే చాలు అదే అనువదించుకుంటుంది. హ్రుదయపు లోతుల్లో నుంచి పుట్టిన  తేనెల ఊటలు ఆయన పాటలు  .


తరలిరాద తనే వసంతం అంటూ ప్రక్రుతి గొప్పతనాన్ని వర్ణించినా, నీవేం చేశావు నేరం అంటూ అఘాయిత్యానికి గురైన ఓ ఆడ కూతురుకు కొండంత ధైర్యాన్ని నింపినా ఆయన కలానికే చెల్లు. విధాత తలపున ప్రభవించిన జీవన వేదాన్ని వినిపించాలంటే సిరివెన్నెల సిధ్ధపడాల్సిందే. చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడకా అంటూ అసలైన సౌభాగ్యం ఏమిటో చాటి  చెప్పినా, కాచి వడపోసే జీవిత సత్యాలు వల్లించినా సీతారాముడి కలానికే సాధ్యం. 


గాంధి అంటే పచ్చ కాగితం మీద నవ్వితే బొమ్మ కాదు. అఖిల లొకాలకే మహాత్ముడు, అహింసామూర్తి  అంటూ దేశభక్తిని ప్రభోదించాలన్నా, మేమే ఇండియన్స్ అంటూ సగటు భారతీయుడి స్వభావాన్ని చక్కగా చెప్పాలన్నా కూడా శాస్త్రి గారు చేయి చేసుకోవాల్సిందే. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటూ వేదాంతం పండించిన ఆ కలం తెల్లారిది లెగండో అంటూ చైతన్యపూరితమైన సందేశమూ ఇస్తుంది.దాదాపు మూడున్నర దశాబ్దాల సినీ జీవీతం ఆయనది. కళాతపస్వి కే విశ్వనాధ్ చిత్రం జననీ జన్మభూమిలో గంగావతరణం ఘట్టంపై పాటను రచించి తొలిసారిగా వెండి తెరకు పరిచయం అయిన సీతారామశాస్త్రి సిరివెన్నెల మూవీలో మొత్తం పాటలు రాసి ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. నంది అవార్డులు లెక్కలేనని తీసుకున్న ఆయన ప్రతీ పాటలోనూ భావం ఉంటుంది. దేశం, సందేశం కూడా ఉంటుంది. 


నిజానికి ఎపుడో ఆయనకు పద్మశ్రీ రావాలి. కానీ సాహితీలోకం అంటే పెద్దగా పట్టని పాలకుల తీరు వల్ల ఇన్నాళ్ళు జాప్యం జరిగింది. ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ అయిన సీతామశాస్త్రికి తెలంగాణా సర్కార్ సిఫార్స్ చేసి పద్మ పురస్కారం ఇప్పించడం నిజంగా గొప్ప విషయం. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి కేసీయార్ కి అభినందనలు చెప్పాలి. తెలుగు సినిమా పాటలు అంటే చులకన భావం ఉన్న వారికి సీతారామశాస్త్రి పాట వింటే చాలు గొప్ప గౌరవం కలుగుతుంది. సినిమా సీమను తమ కలం బలంతో ఏలిన పింగలి. సముద్రాల, ఆత్రేయ, ఆరుద్ర, శ్రీ  శ్రీ, దాశరధి, నారాయణరెడ్డి, వేటూరి సుందరరమమూర్తి వంటి వారి సరసన నిలిచి వేలాది సినీ గేయాలను పూయించి తెలుగు భాషకు, సాహిత్యానికి ఎనలేని కీర్తిని తెచ్చిన సీతారామశాస్త్రి గారికి  పద్మశ్రీ పురస్కారం దక్కడం ప్రతి తెలుగు వాడు గర్వించాల్సిన విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: