తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు రెడీ అవుతోంది. అయిదేళ్ల పాటు ఎలా ఉన్నా సరైన సమయంలో సర్దుకోవడం ఎలాగో చంద్రబాబుకు బాగా తెలుసు, ఇక స్వజనం అయిన మీడియా, ఇతర వర్గాల మద్దతు ఎపుడు పసుపు పార్టీకి శ్రీరామ రక్షగా ఉంటోంది. గతంలో మద్దతుగా నిలిచిన వారు మళ్ళీ ఇపుడు సైకిలెక్కుతున్నారు.


సూపర్ స్టార్ క్రిష్ణ కాంగ్రెస్ వాది. అంతకు మించి అన్న నందమూరికి ఇటు చిత్రసీమలోనూ, అటు రాజకీయాల్లోనూ బద్ద వైరిగా మారి సంచలనం స్రుష్టించారు. ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి టీడీపీని ఆ రోజుల్లో అడ్డుకున్నారు. ఇక సినిమాలు కూడా అన్న గారికి వ్యతిరేకంగా తీసి జనంలో చైతన్యం తెచ్చారు. ఆ తరువాత క్రిష్ణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే చంద్రబాబు జమానాలో తన భార్య విజయనిర్మలను ఓ ఉప ఎన్నికలో టీడీపీ తరఫున పోటీకి నిలబెట్టి క్రిష్ణ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. 2014 నాటికి క్రిష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇపుడు ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు టీడీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. దానికి క్రిష్ణ ఆమోదముద్ర ఉందని అంటున్నారు. 


ఇదిలా ఉండగానే యంగ్ హీరోలు ఇపుడు టీడీపీకి జై అంటూండడం విశేషం. తాజాగా కియా మోటార్స్ ఏపీకి రావడం పట్ల యంగ్ హీరో రామ్ పోతినేని ట్వీట్ చేస్తూ బాబు సర్కార్ ని అభినందించారు. ఏపీలో మంచి అభివ్రుధ్ధి జరుగుతోందని ప్రశంసించారు. దాంతో  ఈ కుర్ర హీరో మద్దతు మీద అనుకూల మీడియాలో ఓ రేంజిలో ప్రచారం సాగుతోంది. ఇది చాలదన్నట్లుగ మంచు వారి అబ్బా యి మనోజ్ కూడా ఏపీ సర్కార్ కి బిగ్ చీర్స్ అంటూ ట్వీట్ చేశారు. ఆయన  తండ్రి మోహన్ బాబు కూడా ఒకపుడు టీడీపీ రాజ్యసభ సభ్యుడే. మరి మనోజ్ ఇలా అనడం వెనక మంచు కుటుంబం ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో చూడాలి.

ఇక ప్రస్తుతం సినీ విరామం తీసుకుని తన ఆలోచనలు జనంతో యూ ట్యూబ్ ద్వారా పంచుకుంటున్న సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అయితే మళ్ళీ ఏపీలో బాబే అధికారంలోకి వస్తారని చెప్పడం విశేషం. ఇలా ఒక్కొక్కరుగా టీడీపీకి టాలీవుడ్ లో సపోర్ట్ పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ మద్దతు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి టాలీవుడ్ అంటేనే ఓ సామాజిక వర్గం ఆధిపత్యం అధికంగా ఉన్న రంగం. ఆ మద్దతు టీడీపీకి లభించడం అంటే పెద్ద విశేషం ఏదీ లేదు కానీ ఏపీ విడిపోయాక మళ్ళీ ఇలా హీరోలు గొంతు సవరించుకోవడం మాత్రం విచిత్రమే.



మరింత సమాచారం తెలుసుకోండి: