విజయ్ దేవరకొండ, సందీప్ వంగ కాంబినేషన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. టైటిల్ తో పాటుగా ప్రచార చిత్రాలు చూసి ఆ అన్ని చిన్న సినిమాల్లో ఇది ఒకటని అనుకున్నారు. కాని ఆఫ్టర్ రిలీజ్ ఆ సినిమా అసలు లెక్క ఏంటో తెలిసింది. ఈమధ్య కాలంలో వచ్చిన మోస్ట్ ఇంటెన్సిబుల్ లవ్ స్టోరీగా యూత్ ఆడియెన్స్ ను పిచ్చి వాళ్లను చేసింది అర్జున్ రెడ్డి.


తెలుగులో బంపర్ హిట్ అందుకున్న ఈ సినిమాను తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హిందిలో మాత్రుక దర్శకుడు సందీప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డిగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అక్కడ కబీర్ సింగ్ గా ఈ సినిమా వస్తుంది. ఇక తమిళ వర్షన్ విషయానికి వస్తే చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.


సీనియర్ డైరక్టర్ బాలా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వర్మ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ నవ్వుల పాలవగా లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ సోసోగానే అనిపించింది. ఫస్ట్ కాపీ సిద్ధమైన ఈ సినిమాను చూసిన నిర్మాతలు చాలా అసంతృప్తిగా ఉన్నారట. ఇలానే రిలీజ్ చేస్తే ఒరిజినల్ వర్షన్ ను చెడగొట్టినట్టు అవుతుందని ఆ సినిమాను మళ్లీ మొదటి నుండి షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.


ఈ4 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా అధికారికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ధ్రువ్ తప్ప మిగతా కాస్ట్ అండ్ క్రూ మొత్తం కొత్త వాళ్లను తీసుకుంటామని చెప్పారు. ధ్రువ్ మొదటి సినిమానే ఇలా అవడం కొద్దిగా బాధపడాల్సిన విషయమే. అయితే అలా రిలీజ్ చేసి డిజపాయింట్ అవడం కన్నా మళ్లీ సినిమా మొదలు పెట్టడం కరెక్టే.. అయితే నిర్మాతలు అనుకున్న బడ్జెట్ కు డబుల్ అవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: