ప్రముఖ  తెలుగు చలన చిత్ర దర్శకుడు కోడి రామక్రిష్ణ ఈ రోజు కన్ను మూశారు. గత కొంత కాలంగా శ్వాస కోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కోడి రామక్రిష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసిన చిర కేర్తిని సంపాదించుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి, బాలక్రిష్ణ వంటి హీరోలతో ఆయన ఎన్నో  బ్లాక్ బస్టర్ మూవీస్ అందించారు.


పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. దాసరి నారాయణ రావు శిష్యుడిగా మొదలైన అయన ప్రస్థానం.. తెలుగు తెరపై ఓ ముద్ర వేసింది. ఆయన మృతితో టాలీవుడ్‌ శోక సంద్రంలో మునిగింది.  పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఫాంటసీ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన శైలి భిన్నమని అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి సినిమాలను చూస్తే తెలుస్తుంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన ఆయన వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. 2016లో కన్నడ చిత్రమైన ‘నాగహారవు’ ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా


ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య మూవీ ద్వారా సినీ దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన కోడి రామక్రిష్ణ  తన గురువు దాసరి నారాయణరావు బాటలోనే అన్ని రకాల సినిమాలకు దర్శకత్వం వహించి ఆల్ రౌండర్ అనిపించుకున్నారు. కోడి బాలయ్య, భార్గవ్ ఆర్ట్స్  అంటే అప్పట్లో ఓ క్రేజ్. మంగమ్మ గారి మనవడుతో మొదలుపెట్టిన వీరి కాంబో  వరసగా ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు వంటి సినిమాలతో రికార్డులు బ్రేక్  చేసింది.అలాగే మెగా స్టార్ చిరంజీవితో ఆయన రూపొందించిన అంజి మూవీకి ఎంతో పేరు వచ్చింది. వెంకటేష్ తో దేవీ పుత్రుడు, శత్రువు తీసి హిట్ కొట్టారు. నాగార్జునతో మురళీక్రిష్ణుడు  సక్సెస్ మూవీ తీశారు. ఇక పోలీస్ పాత్రలో రాజశేఖర్ ని నిలబెట్టిన మూవీ అంకుశం కోడి రామక్రిష్ణదే. అనేక మూవీస్ తీసిన ఆయన లో బడ్జెట్   మూవీస్ కి అందుబాటులో ఉండడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: