మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నరేష్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. రెండు సంవత్సరాల పాటు ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, దానికి అందరి సహకారం కావాలని ఆయన కోరారు. మా అసోసియేషన్‌కి తన వంతుగా 1,1116 రూపాయలను విరాళంగా అందజేశారు నరేష్. ‘మా’లో సభ్యత్వ రుసుమును లక్ష నుండి 90 వేలకు తగ్గించారు. ఇదే సమయంలో ఆయన మాట్లాడుతున్నంత సేపు నేను..నేను అంటూ సంబోధించాడు.  దాంతో పక్కనే ఉన్న నటుడు రాజశేఖర్ ఒకంత అసహనానికి గురయ్యారు.


  ఈ సందర్భంగా నరేష్ మాట్లాడిన తీరుపై నటుడు, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్ వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు  నరేష్ మాట్లాడిన మాటల్లో ఎక్కడా ‘మేము’ అనే పదం వాడకుండా ‘నేను’ అనే పదం వాడారని రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు.  నరేష్ అన్నీ మాట్లాడేశారని.. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడటం తనకు ఇష్టం లేదంటూ మైక్ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయారు. ఆ తర్వాత జీవిత చేతిలో నుంచి మైక్ తీసుకుని... తాను మాట్లాడేందు కు చాలా ఉందని, ఓపిక ఉంటే వినవచ్చని రాజశేఖర్ అన్నారు. 


తాను ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతానని.. 'నేను' అని కాకుండా 'మేము' అని నరేష్ మాట్లాడాలని... ఈ కార్యక్రమానికి తాను రావాలనుకోలేదని, నరేష్ వచ్చి పిలిస్తేనే వచ్చానని, ఆయన తనకు మంచి మిత్రుడు కాబట్టే వచ్చానని చెప్పారు. ఇక నుంచి నరేష్ మనం అంటూ ముందుకు వెళితే అందరికీ బాగుంటుందని రాజశేఖర్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: