సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గత నెల 29 న రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాపై కొంత కాలంగా ఎన్నో విమర్శలు..వివాదాలు నడిచాయి.  ఒకదశలో ఈ సినిమా ఆపేందుకు టీడీపీ శ్రేణులు కోర్టు కూడా వెళ్లారు.  కానీ అన్ని అడ్డంకులు ఛేదించుకొని సినిమా రిలీజ్ అయ్యింది. కాకపోతే ఏపిలో మాత్రం ఈ సినిమా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చి సినిమా విడుదలైనా, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించకపోయినా.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై మాత్రం జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ) మాత్రం నిషేధం విధించింది.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ మూవీని ఇక్కడ ప్రదర్శించబోమని సంచలన నిర్ణయం తీసుకుంది.  సాధారణంగా కొత్తగా విడుదలైన సినిమాను ప్రతి శనివారం ఎఫ్‌ఎన్‌సీసీలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. అది ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగానే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఇటీవల విడుదలైన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను ప్రదర్శించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో  ఆసక్తిని కలిగించిన ఈ సినిమాను తమ కోసం ప్రదర్శించాలని ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యులు కోరుతున్నారు.

 కానీ  ఈ విషయాన్ని తెలుసుకున్న  ఓ వర్గానికి చెందిన వారు ఎట్టి పరిస్థితిలో ఆ సినిమాను ఎఫ్‌ఎన్‌సీసీలో ప్రదర్శించవద్దంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో క్లబ్ అధ్యక్షుడు సినిమా ప్రదర్శనకు అంగీకారం తెలుపలేదు.  ఇప్పటికే తెలంగాణలో పలు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో కొంతమంది ఒత్తిడితో ఎఫ్‌ఎన్‌సీసీలో ప్రదర్శనను అడ్డుకోవడం తగదని, అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పలువురు ఫిలింనగర్ క్లబ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: