పాపం .. బోయపాటికి ఒకే ఒక్క ఫ్లాప్ ఇప్పుడు తన కెరీర్ ను సందిగ్ధంలో పడేసింది. చెర్రీతో సినిమా తేడాకొడితే ఆ దర్శకుడికి కచ్చితంగా గ్యాప్ రావాల్సిందే. దర్శకుల్లో స్టామినా ఉందా, వారి సుడి బాగుందా అనే విషయాలు పక్కనపెడితే.. ఈ సెంటిమెంట్ మాత్రం కొనసాగడం విచిత్రం. ఒకరా ఇద్దరా చెర్రీతో సినిమా తేడాకొట్టిన చాలామంది దర్శకులు ఆ తర్వాత తేరుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తాజాగా బోయపాటి శ్రీనుకి కూడా ఆ సెంటిమెంట్ సెగ తగిలింది. వినయ విధేయ రామతో చరణ్ కు ఓ డిజాస్టర్ ఇచ్చిన బోయపాటి.. తాజాగా బాలయ్యతో సినిమా చేసే అవకాశాన్ని మిస్ అయ్యాడు.


కొత్త సినిమా ఎవరితో, ఎప్పుడు చేస్తాడో తెలియని సందిగ్ధంలో పడిపోయాడు. మొన్నటివరకు అఖిల్, మహేష్, రవితేజ పేర్లు చెప్పిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ఏ ఒక్కరితో సినిమా చేయలేని స్థితిలో పడిపోయాడు. అప్పటిదాకా మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు అనిపించుకున్న బొమ్మరిల్లు భాస్కర్ రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా తీశాక మూడేళ్ల పాటు తెరమరుగైపోయాడు. ఒంగోలుగిత్త తర్వాత ఇక తెలుగు ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూడలేదంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మళ్లీ ఇన్నేళ్లకు ఇప్పుడిప్పుడే అఖిల్ సినిమాతో తెరపైకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.


రచ్చ పర్లేదనిపించుకున్నా దర్శకుడు సంపత్ నంది తర్వాతి సినిమా కోసం మూడేళ్లు అనివార్యంగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్ తో సినిమా క్యాన్సిల్ అయి.. ఈ యువ దర్శకుడు ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాడు. అప్పటికే రెండు ఫ్లాపులిచ్చిన శ్రీనువైట్ల కనీసం రామ్ చరణ్ సినిమాతో అయినా గట్టునపడదామనుకున్నాడు. బ్రూస్ లీ తర్వాత వైట్ల పరిస్థితి మరింత వరస్ట్ గా మారింది. ఒకప్పటి క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు అవకాశాల కోసం, హీరోల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. ఇక వెటరన్ డైరెక్టర్ కృష్ణవంశీ పరిస్థితి కూడా ఇంతే. గోవిందుడు అందరివాడేలే ఫ్లాప్ తర్వాత ఈ క్రియేటివ్ డైరెక్టర్ కూడా ఇంకా సరైన ట్రాక్ లోకి రాలేదు. బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లఖియాని కూడా మెగా శాపం వెంటాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: