విశాల్ .. తమిళనాడులో ఏది చేసిన సంచలనమేనని చెప్పాలి. తెలుగు వాడైనా విశాల్ తమిళనాడులో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే విశాల్ ఇప్పుడు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో నడిగర్ సంఘానికి అధ్యక్షుడు, సెక్రటరీలుగా ఉన్న శరత్ కుమార్, రాధారవి.. సంఘానికి సంబంధించిన స్థలాన్ని అక్రమంగా విక్రయించారని ప్రస్తుత నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు.


పత్రాలను తారుమారు చేసి మిగిలిన సభ్యులతో కలిసి స్థలాన్ని అక్రమంగా విక్రయించారని విశాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు పక్కగా ఉంటే విశాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టొచ్చని కొన్ని నెలల క్రితం హైకోర్టు సూచించింది. దీంతో ఆయన కాంచీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా విశాల్ పిటిషన్ మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తును ఆలస్యం చేస్తోన్న కాంచీపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా దర్యాప్తును పూర్తిచేసి, నిందితులను అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశించింది.


దీంతో త్వరలోనే శరత్ కుమార్, రాధారవి అరెస్టు ఖాయమనే వార్త వైరల్‌గా మారింది. స్థలాన్ని ఎంతకు విక్రయించారో తెలియదు కానీ, ఈ విషయం 2016లో వెలుగులోకి రావడంతో కొత్తగా ఎన్నికైన జనరల్ సెక్రటరీ విశాల్ రంగంలోకి దిగారు. వారికి షోకాజ్ నోటీసులు పంపారు. వారి స్పందన సంతృప్తికరంగా లేకపోవడంతో 2017 సెప్టెంబర్‌లో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుకు పోలీసులు సరిగా స్పందించలేదన, విశాల్ కోర్టుకెళ్లారు. విశాల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. పోలీసులకు అక్షింతలు వేసి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించింది. మరి పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి! 

మరింత సమాచారం తెలుసుకోండి: