మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి సినిమలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమా, దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మెగా నిర్మాత రాంచరణ్. 

ఇకపోతే ఈ సినిమా తరువాత మెగాస్టార్ చేయబోయే 152వ సినిమాకు సంబంధించి, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే ఆ సినిమా గురించి కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఆ సినిమాపై చాలావరకు క్లారిటీ వచ్చింది. నేడు దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, అలానే మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. 

ఇక దానితో మెగాస్టార్, కొరటాలతో చేయబోయే సినిమాకు నిర్మాతలుగా ఆ రెండు ప్రొడక్షన్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి అనే విషయం తేటతెల్లం అయింది. అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది, హీరోయిన్, ఇతర నటీనటులు తదితర విషయాలన్నీ కూడా త్వరలో వెల్లడి కానున్నాయని, దానికి సంబంధించి వారి నుండి అతిత్వరలో ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మంచి మెసేజిని కమర్షియల్ పంథాలో చూపించడంలో దిట్టగా పేరుగాంచిన కొరటాల ఈ సినిమాలో మెగాస్టార్ ని ఏ విధంగా చూపిస్తారో అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: