కార్పోరేట్ స్కూళ్లు, కాలేజీల పని పడతాం..అధిక ఫీజు వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలపై ఉక్కు పాదం మోపుతాం అంటూ ప్రభుత్వంలు ప్రజలకు హామీలు ఇస్తున్నాయి. కానీ కార్పోరేట్ యాజమాన్యాలు మాత్రం విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ముక్కు పిండి మరీ వసూళ్లకు తెగబడుతున్నారు.  కేవలం నోటి మాటల వరకు మాత్రమే పరిమితం అవుతున్న ఈ వాగ్దానాల వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల ఎంతో ఆవేదన చెందుతున్నారు.


పట్టణాల్లో చిన్న పిల్లల చదువు సైతం తలకు మించిన భారం అవుతుంది.  వచ్చే జీతం తో కుటుంబ పోషన, పిల్లల చదువు, బట్టలు, బుక్స్ ఇలా జూన్, జూలై మాసం వస్తే తల్లిదండ్రులు కష్టాలు ఆ భగవంతుడికే తెలియాలి.  తాజాగా ఏడవ తరగతి చదువుతున్న తన కొడుకు ఫీజు కట్టలేక  కోలీవుడ్ లో కాస్ట్యూమర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై, కోడంబాక్కమ్ ప్రాంతంలో వెంకట్రామన్‌ (45) అనే సినీ కాస్ట్యూమర్‌ కుటుంబం ఉంటోంది.

ఇటీవలి కాలంలో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. కేవలం ఒకటీ రెండు రోజులు మాత్రమే పని దొరకడంతో డబ్బులు లేక భార్య నగలు అమ్మి కొంత కాలం పరిస్థితులను నెట్టుకుంటూ వచ్చాడు.  ఆ డబ్బులు అయిపోగానే అందినంత వరకు అప్పులు చేశాడు.. వెంకట్రామన్ చిన్న కొడుకు 7వ తరగతి చదువుతుండగా, స్కూల్ పీజు కట్టడానికి డబ్బు అవసరమైంది.

ఎవరిని అడిగి చూసినా డబ్బు దొరకలేదు.  దాంతో తన కొడుకు చదువుకోవడానికి కూడా డబ్బులు లేని దుర్భర స్థితిలో ఉన్నానని మనస్థాపంతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వడపళని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: