సినిమా అనే అద్భుత రూపకల్పనలో పైకి కనిపించేది హీరో, హీరోయిన్లు, దర్శకులు తప్పితే నిర్మాతలు మాత్రమే. అయితే ప్రతి సినిమా వెనుక తెరపై కనిపించే వారికంటే కనిపించని వారి కష్టమే ఎక్కువ ఉంటుంది. సినిమాను రూపొందించడంలో సాంకేతిక నిపుణులు పాత్ర చాలా కీలకం. 


దర్శకుల ఆలోచనలకు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ జోడించి అద్భుత దృశ్య కావ్యంగా మలిచి సినిమా స్థాయి పెంచేది వీరే. ఇలా దర్శకుల ఆలోచనలకు తన విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా దృశ్య రూపం ఇచ్చే అతి కొద్దిమంది సాంకేతిక నిపుణుల్లో శ్రీనివాస్ మోహన్ ముందు వరుసలో ఉంటారు. 


‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘2.ఓ’, రోబో, క్రిష్, ఐ వంటి చిత్రాలకు అద్భుత విజువల్ ఎఫెక్ట్స్ అందించిన శ్రీనివాస్ మోహన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అవార్డ్స్ అందించే ది అకాడమీ సంస్థలో శ్రీనివాస్ మోహన్.. ప్యానల్ సభ్యుడుగా పిలుపు అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి శ్రీనివాస్ మోహన్‌ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 


‘ప్రపంచస్థాయిలో చాలామంది వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్లు ఉన్నప్పటికీ ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్‌ అకాడమీ నుంచి మీకు పిలుపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్‌ సర్‌’ అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి అప్ కమింగ్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి కూడా శ్రీనివాస్ మోహన్ వీఎఫ్‌ఎక్స్‌ అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: