సాహో సినిమా వాయిదా పడుతుందన్న న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎట్టి పరిస్థితిలో ఆగష్టు 15 కు ఈ సినిమా వస్తుందని నిర్మాతలు చెప్పిన సంగతీ తెలిసిందే. అందువల్ల ఆ సినిమా వెనక్కు వెళ్తుంది అంటే ఎవ్వరూ ఊహించలేదు. నమ్మలేదు. కానీ దాదాపు వారం రోజులుగా ఈ మేరకు వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టడం మొదలయింది. కానీ సాహో యూనిట్ తో పరిచయం వున్నవారంతా ఆ వార్తలను ఇట్టే కొట్టిపారేసారు. సమస్యే లేదు, సాహో విడుదల 15న పక్కా అంటూ వచ్చారు.


ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, సాహోలో ఏం జరుగుతోంది అన్నది ఒకరిద్దరు కీలక వ్యక్తులకు తప్ప వేరేవారికి తెలియదు. అందువల్ల ఏదో జరుగుతోంది అని టాక్ నే తప్ప, ఏం జరుగుతోంది అన్నది క్లారిటీగా తెలియదు. ఇలాంటి నేపథ్యంలో వాయిదా వార్త బయటకు వచ్చింది. ఇప్పటికీ సాహో యూనిట్ అధికారికంగా ప్రకటించకపోవడం విశేషం. వాయిదా పడడం నేరం, ఘోరం కాదు, సాహోలాంటి భారీ సినిమాకు అసలే కాదు. కానీ ప్రోపర్ గా కమ్యూనికేట్ చేయకపోవడం సరికాదు.


సాహోను ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా విదేశాల్లో విడుదల చేసే ఆలోచన వుంది. విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావాలి. ఇవన్నీ పక్కాగా వెల్లడించి, డేట్ విషయం అధికారికంగా ప్రకటించి వుంటే గ్యాసిప్ లకు, అక్కరలేని గుసగుసలకు ఆస్కారం లేకుండా వుంటుంది. కానీ సాహో కీలక బాధ్యులు అలా చేయకపోవడంతో, ఇప్పుడు, ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసే అవకాశం వుంది. ఒకటి పక్కన మరొకటి చేరిస్తే తప్ప, కొత్త వార్త పుట్టదు అనుకునే జనాలు కూడా వుంటారు. అలాంటి వ్యవహారాలు అన్నీ కలిసి సాహో పై గ్యాసిప్ లు గంపల కొద్దీ పుట్టించక ముందే అధికారికంగా ప్రకటించడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: