సాధారణంగా అన్నీ భాషల్లో సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఏ భాషలోను ఒక టీవీ షో కి సెన్సార్ ఉండటం ఇప్పటి వరకు జరగలేదు. అందుకే గత కొంతకాలంగా టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలకు అస్సలు హద్ధు ఉండటం లేదు. అందులో భాగంగానే బిగ్ బాస్ టీవీ రియాలిటీ షోను ఆపాలంటూ హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యిందని సమాచారం. ఎలాంటి సెన్సార్ లేకుండా టీవీలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం సమాజానికి చెడు సంకేతాలను ఇస్తోందంటూ పిటిషనర్ లో తెలిపారు. వివాదాలు ఎక్కడ ఉంటే తను అక్కడ ఉండాలని ప్రయత్నించే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు సంచలనం అవుతోంది.

బిగ్ బాస్ రియాలిటీ షోపై ఆయన పలు ఆరోపణలు చేశాడు. ఆ కార్యక్రమంలో పాల్గొనే వారిని నిర్వాహకులు రెచ్చగొడతారని, తక్కువ సమయంలో గుర్తింపు వస్తుందని అందులో పాల్గొనేవారు కూడా రెచ్చిపోతారని..ఇలాంటి రచ్చకు సెన్సార్ లేకపోవడం వల్ల ఇది దుష్ప్రభావాలు చూపిస్తుందని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. అయితే టీవీ కార్యక్రమాల్లో చాలా వాటికి సెన్సార్ ఉండటంలేదు. టీవీల్లో ప్రసారం అయ్యే సినిమాల్లో అయినా చాలా కటింగ్స్ ఉంటున్నాయి కానీ..చాలా కార్యక్రమాలు సెన్సార్ లేకుండానే ప్రసారం అవుతున్నాయి. జబర్దస్త్, పటాస్ లు ఆ కోవలోకి వచ్చేవే.

ఇలాంటి నేపథ్యంలో బిగ్ బాస్ కు సెన్సార్ లేదని, ఆ కార్యక్రమం ప్రసారాన్ని ఆపేయాలని పిటిషనర్ కోరడంపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది. అయితే ఇలాంటి పిటిషన్ల వల్ల బిగ్ బాస్ నిర్వాహకులు కోరుకుంటున్న ప్రచారం అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి.. బిగ్ బాస్ నిర్వాహకులు కోరుకునేది వివాదాలే కదా! అన్న కామెంట్స్ కూడా బాగానే వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: