నాచురల్ స్టార్ నాని ఇటీవల వరుస విజయాలతో మంచి సక్సెస్ హీరోగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇక ప్రస్తుతం అయన, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు తో కలిసి వి అనే డిఫరెంట్ మూవీ, అలానే గ్యాంగ్ లీడర్ అనే మరో మూవీలో నటిస్తున్నారు. ఇక వీటిలో ముందుగా గ్యాంగ్ లీడర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వెరైటీ సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం జరుగుతోంది. 

ఇక ఈ సినిమా టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసింది సినిమా యూనిట్. ఇకపోతే ఈ సినిమాను ఆగష్టు 30న విడుదల చేస్తున్నట్లు చాలారోజుల క్రితం ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ సాహోను తొలుత ఆగష్టు 15న విడుదల చేయాలనీ భావించినప్పటికీ సినిమాలో క్వాలిటీ మరింత బాగుండాలని భావించి విడుదలను మరొక 15 రోజులు పోస్ట్ పోన్ చేసి ఆగష్టు 30న విడుదల చేయనున్నట్లు ఆ సినిమా నిర్మాతలు సడన్ గా ప్రకటించడంతో, గ్యాంగ్ లీడర్ విడుదల పై కొంత సందిగ్ధత నెలకొంది. 

ఇక ఇటీవల ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య కొంత సయోధ్య కుదిరినట్లు వార్తలు వచ్చినప్పటికీ, గ్యాంగ్ లీడర్ యూనిట్ మాత్రం తమ సినిమా విడుదల తేదీని మార్చేది లేదని పక్కాగా తేల్చి చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి ప్రభాస్ సాహో, అత్యంత భారీ స్థాయిలో, అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్నప్పటికీ కూడా, తన సినిమాను అదే రోజున విడుదల చేస్తున్న నాని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్తూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. మరి ఒకే రోజు విడుదలవుతున్న ఈ రెండు సినిమాల్లో ఏది ఎంతవరకు విజయవంతం అవుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: