కళాతపస్వి పద్మశ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు ఎంత గొప్ప దర్శకులో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన మహానుభావులు.. కె.విశ్వనాథ్. అందుకే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనను వరించింది.  ఆయనతో పాటు ఉన్న దర్శకులు కమర్షియల్ హంగులతో సినిమాలు తీస్తుంటే విశ్వనాథ్ గారు మాత్రం భారతీయ సాంప్రదాయ కళలకు ప్రాధాన్యమిస్తూ సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం వంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి యావత్ సినీ ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. అంతేకాదు విమర్షకుల నుండి ఎన్నో గొప్ప ప్రశంసలు అందుకున్నారు.

అంతేకాదు సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను ఆధారంగా తీసుకుని సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలను తెరకెక్కించడం విశ్వనాథ్ గారికే చెల్లింది. ఆయన తెరకెక్కించిన సినిమాలలో గొప్ప కళాఖండాలుండటం ఒక విశేషం. మాంచి మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకొని మాస్ హీరోగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న మెగాస్టార్ తో స్వయంకృషి సినిమాని తీసి అందరు ఆశ్చర్యపోయోలా చేశారు. అంతేకాదు కమల్ హాసన్ తో శుభసంకల్పం తీయడం కూడా పెద్ద సాహసమేనని చెప్పాలి.

ఇంతటి గొప్ప ఘనత ఉన్న చివరిగా అల్లరి నరేష్ ని హీరోగా పెట్టి శుభప్రదం సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దర్శకత్వం వహించే
బాధ్యతను పక్కనబెట్టేశారు. కానీ కలిసుందాం రా, సంతోషం, శుభసంకల్పం, స్వరాభిషేకం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, నీ స్నేహం, అతడు..వంటి సినిమాలలో మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులకు చేరువలోనే ఉన్నారు. అయితే ఒక ముఖ్యమంత్రి 'మీరు మళ్లీ మంచి సినిమా తీయాలి. మీ అసిస్టెంట్ ల సాయంతో సినిమా తీయండి. నిర్మాణం సంగతి మరిచిపోండి, అది నేను చూసుకుంటాను' అనడం కొన్ని లక్షల మందికి ఉత్సాహాన్నిచ్చింది. అవును ఈ మాటలన్నది మరెవరో కాదు స్వయాన తెలంగాణా ముఖ్య మంత్రి 'కేసిఆర్'.  ఇది నిజంగా కార్యరూపం దాల్చితే మాత్రం విశ్వనాథ్ గారి ద్వారా తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన కళాఖండాలుగా మిగిలిపోయో సినిమాలు మరికొన్ని వస్తాయనడానికి రవ్వంత కూడా సందేహం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: