తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న సంబంధం సాధారణమైంది కాదు. అయితే టిడిపి పెట్టిన నాటి నుంచి టాలీవుడ్ నుంచి ఆ పార్టీకి ఎక్కువ మద్దతు లభిస్తూ వుండేది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కూడా వైసీపీకి ఇండస్ట్రీ నుంచి జై కొట్టిన వారి సంఖ్య తక్కువే. పోసాని, పృథ్వీ నుంచి మొదలుపెడితే అలీ, జయసుధ, మోహన్ బాబు ఇలా చాలా పరిమితమైన జాబితా. ఒక వైపు టాలీవుడ్ పెద్దలకు జగన్ ఏపీ సీఎం అవ్వడం ఇష్టం లేదన్న కాంట్రవర్సీ కోణం సద్దుమణగలేదు. అదే సమయంలో టాలీవుడ్ నుంచి వైసిపికి మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతోందా అన్న చర్చ కూడా ఫిలింనగర్ లో మొదలయ్యిందట. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా బాధ్యతలు తీసుకునేవేళ వి వి వినాయక్ అక్కడ ఉండటమే ఈ డిస్కషన్ కి కారణమట. 



జక్కంపూడి రాజా తండ్రి పేరుని నిలబెట్టాలి అని ఆకాంక్షించిన వీవీ వినాయక్ రాజాకి ఈ బాధ్యతలు ఇచ్చినందుకు వై ఎస్ జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. జక్కంపూడి ఫామిలీతో ఉన్న వ్యక్తిగత పరిచయాల కారణంగా వి వి వినాయక్ ఈ కార్యక్రమానికి హాజరై ఉండొచ్చు. లేదా సామాజికవర్గం కోణంలో ఉన్న పరిచయాలు కూడా అందుకు రీజన్ అయి ఉండొచ్చు. కానీ, టాలీవుడ్ నుంచి వైసీపీ కండువాలు వేసుకున్న వాళ్లు అతి తక్కువగా ఉండటంతో వి వి వినాయక్ వైసీపీలో చేరుతారా, లేక ఆ పార్టీ మద్దతుదారుడిగా కొనసాగుతారా అనే డిస్కషన్ కొనసాగుతుంది. 



నిజానికి ఇండస్ట్రీలో అందరి తోనూ వీవీ వినాయక్ కి మంచి సంబంధాలున్నాయి ఇప్పుడు బాలకృష్ణతో కూడా ఒక సినిమాకి సంబంధించి స్క్రిప్టు వర్క్ నడుస్తోందట. కేయస్ రవికుమార్ సినిమా పూర్తయిన తర్వాత వి వి వినాయక్ బాలకృష్ణ కాంబినేషన్ ఉండే చాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఇప్పటి దాకా ఏ పార్టీకీ పూర్తిగా మద్దతు ప్రకటించి నేను పలానా పార్టీ అని వి వి వినాయక్ ఎక్స్పోస్ కాలేదు. దీంతో ఒకవేళ వైసీపీకి దగ్గరగా ఉన్న సపోర్టర్ గా కొనసాగుతారు తప్ప, ఆ పార్టీ కండువా వేసుకునే అవకాశం లేదని పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోందట. 



జక్కంపూడి రాజా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వినాయక్ హాజరు కావడాన్ని కూడా అలానే చూడాలని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయట. మరోవైపు వి వి వినాయక్ వైసీపీ కార్యక్రమాల్లో వేదిక మీద మెరవడంతో టాలీవుడ్ నుంచి రాబోయే రోజుల్లో చాలా మంది తమ పార్టీకి జై కొడతారని కార్యకర్తలు జోష్ మీదున్నారట. టాలీవుడ్ పెద్దలకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదన్న కాంట్రవర్సీ యాంగిల్ చల్లారకముందే ఈ రకమైన డిస్కషన్ మొదలు కావడంతో పరిస్థితి కాస్త కూల్ అవుతుంది అని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయట.


మరింత సమాచారం తెలుసుకోండి: