ఏపీ-తెలంగాణ వేరైన తర్వాత టాలీవుడ్ ఆంధ్ర ప్రదేశ్ కి వెళుతుందని చాలామంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. తెలంగాణ ప్రభుత్వ సానుకూల ధృక్పథమో లేక రెండు రాష్ట్రాల్లో ఫిలిం బిజినెస్ కి కోట్లలో నష్టం వాటిల్లుతుందనో తెలీదుగాని పరిశ్రమను ఎవరూ ఇక్కడ్నుంచి ఏపీకి కదల్చలేకపోయారు. ఇక ఏపీ గత ప్రభుత్వంలోనూ కొత్త టాలీవుడ్ విషయంలో ఆసక్తి లేకపోవడం.. అసలు అలాంటి ఆలోచనే లేకపోవడం వంటి సవా లక్ష కారణాలతో ఎవరూ ఆ మాటే మాట్లాడలేదు. కొందరు పరిశ్రమ పెద్దలైతే ఇది అయ్యే పని కాదు! అంటూ సైలెంట్ అయిపోయారు.

అయితే ఇండస్ట్రీ అగ్రనిర్మాతలు- స్టూడియో ఓనర్లు కం ఎగ్జిబిటర్లుగా కొంతమంది ప్రముఖులు కూడా ఏపీకి పరిశ్రమ తరలించే విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కనీసం అక్కడో స్టూడియో కడతామని కానీ.. ఇంకేదైనా ప్రయత్నం చేస్తామని కానీ మాట వరుసకు కూడా అనకపోవడం ఆశ్చర్యపరిచింది. అయితే ఇన్ని సర్ ప్రైజ్ ల మధ్య మరో ఆశ్చర్యకరమైన ప్రకటన వినగానే తెలుగు జనాలకు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది.

ఏపీలో రాజధాని అయిన అమరావతికి కూతవేటు దూరంలో గుంటూరు పరిసరాల్లోని సూర్యలంకలో రూ.500 కోట్లతో సినిమా స్టూడియో- థీమ్ వాటర్ పార్క్ ఏర్పాటు చేస్తామని టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ప్రకటించారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన బుధవారం ఈ ప్రకటన చేయడం ఆసక్తిని కలిగించింది. అయితే రూ.500కోట్లు అంటే మాటలు కాదు. కానీ అందుకు నమ్మగలిగే కారణమే చెప్పారు. ఒక అంతర్జాతీయ సంస్థతో చర్చలు సాగిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖతో ఆ అంతర్జాతీయ సంస్థను కలిపి ఈ డీల్ సెట్ చేయాలన్నది ప్లాన్. అమెరికాలోని డిస్నీల్యాండ్ థీమ్ పార్క్ తరహాలో అభివృద్ధి చేయనున్నారని కోన తెలిపారు. నిజంగా ఇప్పటివరకూ తెలుగు సినీపరిశ్రమ నుంచి ఎవరైనా ఒక ప్రముఖుడు ఇలాంటి ప్రయత్నం చేసిందే లేదు. కోన చేస్తున్న ప్రయత్నం సక్సెసైతే మంచిదేనని చాలా మంది ఈ ప్రకటన చూసి అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: