ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తమ రాజకీయ ఫ్యూచర్ కోసం ఆ హీరోని రంగంలోకి దించేందుకు కొంత మంది నేతలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంలో నిజమెంత.? జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది అన్న ప్రచారం మొదలైంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీలోకి వెళ్లలేని కొంత మంది నేతలు జూనియర్ ఎన్టీఆర్ కు టచ్ లోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. టిడిపి ఘోరంగా ఓడిపోయి నేతలు బీజేపీ బాట పడుతున్న సమయంలో మరో పార్టీ అవసరం ఏపిలో ఉందన్న వాదన రాజకీయ నిరుద్యోగులలో ఉంది.


తాత నందమూరి తారక రామారావు నటన వారసుడిగా సినిమాలో తనను తాను నిరూపించుకుంటున్నారు జూనియర్. స్టార్ ఇమేజ్ తో ఉన్న ఎన్టీఆర్ మంచి వాగ్ధాటి. వర్తమాన పరిస్థితులపై అవగాహన ఉన్న వాడిగా గుర్తింపు ఉంది. రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ఆయన ప్రచారం చేసే సమయంలోనే ఆయన లోని రాజకీయ నాయకుడు ఫోకస్ అయ్యాడు. అప్పట్లో రాజకీయాల పట్ల ఆయన ఆసక్తిగా కూడా ఉండేవారు. జూనియర్ నటించిన కొన్ని సినిమాలలో పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఉండే డైలాగులకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది కూడా. ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్ గా అప్పట్లో టిడిపికి సపోర్ట్ చేసిన జూనియర్ ఆ తర్వాతి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాల గొడవలో తాను మునిగిపోయారు.


ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో నిర్మాణంలో ఉన్న మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో తారక్ బిజీగా ఉన్నారు. ఆయన పనిలో ఆయనుంటే, తెలుగుదేశం ఇక లాభం లేదనుకుంటున్న ఆ పార్టీ నేతలతో పాటు మిగిలిన పార్టీలలో ఇమడలేమనుకుంటున్న వాళ్ళు జూనియర్ వైపు చూస్తున్నారంట. అయితే దీనికి జూనియర్ ఎలా స్పందిస్తారనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఫార్టీ ప్లస్ క్లబ్ లో ఉన్న జూనియర్ సినిమాలపైనే తన దృష్టినంతా కేంద్రీకరించారు. తాత ఎన్టీఆర్ సినిమాలలో అన్ని రకాల పాత్రలు పోషించి అంతిమంగా ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. మరి జూనియర్ కూడా అదే ఆలోచనలలో ఉంటారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. అంతేకాదు అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది కూడా బయటకు రావడం లేదు.


ఏపిలో టిడిపి ఓడిపోగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై చర్చ జరిగింది. ఘోరంగా ఓడిన టిడిపికి ఇక పునర్జన్మ లేదని జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఆ పార్టీని కాపాడగలరని ప్రతిపక్షంలో ఉన్న నేతలు కూడా అన్నారు. జూనియర్ కున్న చరిష్మా, కరిష్మా తాత స్టైల్ రాజకీయంగా కలిసొచ్చే అంశాలుగా రాజకీయ పండితులు చెప్తూ ఉంటారు. బాబాయ్ బాలయ్య లోకేశ్ కంటే జూనియర్ లోనే ఎక్కువ పొలిటికల్ యాంగిల్ ఉంటుందన్న చర్చ ఎలాగూ ఉంది. పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన మొన్నటి ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దాంతో సినిమా నటులంటే జనంలో క్రేజ్ తగ్గిందన్న వారు కూడా జూనియర్ రాజకీయాల్లోకి వస్తే  ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. మరి ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి దించాలన్న నేతల ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయో ఏమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: