టాలీవుడ్ సినిమా పరిశ్రమకు యువ నటుడు శర్వానంద్ హీరోగా కొద్దిరోజుల క్రితం వచ్చిన రన్ రాజా రన్ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుజీత్, రిలీజ్ తరువాత ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించాడు. అయితే ఆ వెంటనే అతడికి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సినిమాను తీసే అవకాశం రావడం, అదే సాహో సినిమాగా రూపుదిద్దుకోవడం జరిగింది. నిజానికి సాహో కథను సుజీత్, బాహుబలి కంటే ముందే చెప్పడం జరిగిందని, అయితే తాను అప్పటికే బాహుబలి సినిమాకు కమిట్ అవడంతో, అది పూర్తి కాగానే తనతో సినిమా చేస్తానని మాటిచ్చానని ఇటీవల ప్రభాస్ కూడా మీడియాతో చెప్పారు. 

అయితే మొదట్లో కొంత తక్కువ బడ్జెట్ తో ఆరంభమైన సాహో సినిమా, మధ్యలో ప్రభాస్ నుండి వచ్చిన బాహుబలి రెండు భాగాలూ కూడా అద్భుత విజయాలు అందుకుని ఆయనకు దేశవిదేశాల్లో మంచి పేరు తెచ్చి పెట్టడంతో, సాహోను కూడా మరింత గ్రాండ్ గా తెరకెక్కించాలని భావించారు దర్శక, నిర్మాతలు. ఆ విధంగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా, మొన్న ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి, చాలావరకు నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నేడు ఆదివారం, రేపు వినాయకచవితి పండుగా కావడంతో సాహోకు ఈ రెండురోజులు కలెక్షన్స్ బాగానే వస్తాయని, అయితే మంగళవారం నుండి ఆ సినిమాకు అసలు అగ్ని పరీక్ష మొదలవుతుందని, వాస్తవానికి తమకు ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటికే సాహోకు చాలాచోట్ల కలెక్షన్ల డ్రాప్ కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఈ విషయం అటుంచితే, 

సాహో తరువాత తాను చేయబోయే సినిమా విషయమై నేడు సుజీత్ ఒక నిర్ణయం తీసుకుని తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అత్యల్ప బడ్జెట్ లో ఒక మంచి ఎంటర్టైనర్ సినిమాను మరికొద్దిరోజుల్లో తీసేలా ప్లాన్ చేస్తున్నాడట సుజీత్. ఆ సినిమా కథ కూడా మరికొద్దిరోజుల్లో సిద్ధం అవుతుందని, మరికొద్దిరోజుల్లో దానికి సంబందించిన పూర్తి విషయాలు వెల్లడికానున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం సుజీత్ పాటిస్తున్న ఈ స్ట్రాటజీ, గతంలో దర్శకధీరుడు రాజమౌళి పాటించేదేనని కొందరు అంటున్నారు. ప్రస్తుతం కానప్పటికీ, ఒకప్పుడు మాత్రం, రాజమౌళి ఒక పెద్ద సినిమా చేసిన తరువాత, మరొక చిన్న సినిమా చేయడం చేసేవారని, ఆ విధంగా సుజీత్ కూడా రాజమౌళి ఫార్ములాను ఫాలో అవుతూ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు మాత్రం వెల్లడి కావలసి ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: