విజయవాడ నుండి ముంబై దాకా తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన కెరీర్ లో చాలా మంది దిగ్గజ నటులతో సినిమాలు తెరకెక్కించి మంచి విజయాలు అందుకోవడం జరిగింది. ఇక ఇటీవల కొన్నేళ్లుగా మాత్రం పెద్దగా విజయాలు దక్కకపోవడంతో, ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు వర్మ. ఎప్పటికపుడు రిలీజ్ అయ్యే లేటెస్ట్ సినిమాలు గురించి, అలానే సమాజంలో జరిగే తాజా పరిస్థితుల గురించి అప్పుడప్పుడు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ముందుకు వెళ్తున్నారు వర్మ. ఇక ఇటీవల ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, 

ఏపీలో ఆ సినిమాను విడుదల చేయకుండా నిలుపుదల చేసింది అప్పటి టిడిపి ప్రభుత్వం. అంతటితో ఆగకుండా, ఆ సినిమా ప్రమోషన్ కోసం విజయవాడ చేరుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టదలచిన వర్మను స్థానిక పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇక ఆ సంఘటన తరువాత టిడిపి పై ట్విట్టర్ లో ఒకింత పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు వర్మ. ఇక ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి విజయం సాధించి, వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన సమయంలో తన లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని విజయం సాంగ్ ని పోస్ట్ చేసి ఎంతో సంబర పడ్డారు వర్మ. ఇక ఆ తరువాత 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాను తీస్తున్నట్లు అనౌన్స్ చేసిన వర్మ, ఇటీవల అందులోని క్యాస్ట్ ఫీలింగ్ అనే ఒక సాంగ్ రిలీజ్ చేసి పెద్ద సంచలనానికి తెరలేపారు. 

ఆ తరువాత పవన్ కళ్యాణ్ న పోలిన డూప్ ఫోటో రిలీజ్ చేసిన వర్మ, నేడు చంద్రబాబును పోలిన డూప్ వ్యక్తి కన్నీళ్లు పెడుతున్న ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. నిజ జీవితంలో ఈ రోల్ ఎవరిదో చెప్పండి అంటూ తన ట్వీట్ ద్వారా ప్రేక్షకులను కోరారు వర్మ. దీంతో చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున రెప్లైలు పెడుతున్నారు నెటిజన్లు. ఇక మరోవైపు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోందని, రేపు ఉదయం గం.9 27ని. లకు తమ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు వర్మ. కాగా ఆయన పోస్ట్ చేసిన చంద్రబాబు పోస్టర్, ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: