టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై దాదాపుగా రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మితం అవుతున్న ఈ సినిమా ఇప్పటికే సక్సెస్ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ తదితర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, మేకింగ్ వీడియోలు సినిమా పై అంచనాలు విపరీతంగా పెంచిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళము, మలయాళం, కన్నడ భాషల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు కెమెరా మ్యాన్ గా రత్నవేలు వ్యవహరిస్తుండగా,

బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని, జూలియస్ పాకీయం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా గురించి ఇటీవల దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక ప్రముఖ పత్రిక వారితో మాట్లాడుతూ, ఈ సినిమా కోసం మెగాస్టార్ పడిన కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువేనని, మొత్తం మూడు పాటలు ఉండే ఈ సినిమాలో పది వరకు యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలిపారు. ఇక సినిమా కోసం స్వాతంత్రోద్యమ కాలం నాటి సెట్లను కోట్లాదిరూపాయలు వెచ్చించి నిర్మించడం జరిగిందని, సినిమాలో ఫొటోగ్రఫీతో పాటుగా ఆర్ట్ డైరెక్టర్ యొక్క గొప్పతనం కూడా ఎంతో ఉందని అన్నారు. ఇక సినిమాలోని యాక్షన్ సీన్స్ లో ప్రీ ఇంటర్వెల్ మరియు ప్రీ క్లైమాక్స్ సీన్స్, మొత్తం సినిమాకే హైలైట్ అని అన్నారు. ఇక ప్రీ ఇంటర్వెల్ సీన్ ని ముంబైలోని భారీ స్విమ్మింగ్ పూల్ లో ఎంతో వ్యయ ప్రయాశలతో చిత్రీకరించడం జరిగిందని,

నీటి దిగువన జరిగే ఈ పోరాట దృశ్యంతో ప్రేక్షకులు ఒక కొత్త ఫీల్ ని పొందుతారని అన్నారు. ఇక ప్రీ క్లైమాక్స్ సీన్ లో వచ్చే భారీ యుద్ధ సన్నివేశం, మొత్తం సినిమాకే అతి పెద్ద హైలైట్ అని అన్నారు. సినిమాలో మెగాస్టార్ మరియు నయనతారల జోడి ఎంతో బాగుటుందని, అలానే అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా, అనుష్కల పాత్రలు సినిమాలో ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. రేపు సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు తప్పకుండా చిరంజీవి గారితో పాటు నరసింహారెడ్డి గారి గొప్పతనాన్ని గురించి కూడా మాట్లాడుకుంటారని అన్నారు. అతి త్వరలో ఒక్కొక్కటిగా పాటలను యూట్యూబ్ లో రిలీజ్ చేసి, అనంతరం అతిరథ మహారథుల సమక్షంలో ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాకు కథను పరుచూరి సోదరులు అందించగా, మాటలను సాయిమాధవ్ బుర్ర అందించడం జరిగింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: