నరేంద్ర మోడీని ప్రపంచ నేత అని అమెరికా పెద్దన్న ట్రంప్ ఓ వైపు కొనియాడుతున్న సందర్భం ఇది. ఏ దేశ ప్రధానికి దక్కని  గౌరవం హోస్టన్ మీటింగులో మోడీ అందుకున్నారు. మోడీ అమెరికా టూర్లో రెండు మార్లు ట్రంప్ తో భేటీ కావడం మరో విశేషం. ఇదిలా ఉండగా మోడీ వంటి  సమర్ధ నేత భారత్ కు ఉండడం గొప్ప విషయమని ట్రంప్ అన్న మాటలు అక్షర సత్యాలే. ఇంతలా బయట పేరు తెచ్చుకుంటున్న మోడీ అంటే సెలిబ్రిటీలు ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు.


సుప్రసిధ్ధ సినీ నేపధ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తాజాగా  మోడీకి జై కొట్టారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధలు  లేవని, కానీ మోడీ విధానాలు బాగున్నాయని ఎస్పీబీ అనడం విశేషం. నెల్లూరులో జరిగిన తన తండ్రి విగ్రహావిష్కరణ మీటింగులో పాలుపంచుకున్న ఎస్పీబీ మోడీ ప్రస్తావన తేవడం ఆసక్తికరమే.  ప్రధాని మోడీని అందరూ గౌరవించాలి, అభినందించాలని బాలు పిలుపు ఇవ్వడం పెద్ద చర్చగా ఉంది. సాధారణంగా రాజకీయ వూసు ఎత్తకుండా తన పని తాను చేసుకుపోయే బాలు ఈ రకంగా స్పందించడం విశేష పరిణామమే


. బాలు ఎంతగానో ఇష్టపడే విశ్వ నటుడు, ఆప్త మిత్రుడు  కమల్ హాసన్ కి మోడీ అంటే అసలు గిట్టదు. సొంతంగా పార్టీ పెట్టిన కమల్ ప్రతీ దానికి మోడీని విమర్శలు చేస్తారు. మరి బాలు ఈ రకమైన కామెంట్స్ చేయడం ద్వారా రాజకీయాల్లోకి రాకపోయినా తనకు వాటిని పరిశీలించే ఆసక్తి ఉందేని చెప్పుకున్నారు. కాగా నెల్లూరులో తాను నివసించే ఇంటికి కంచి పీఠానికి బాలు దానం చేయడం గొప్ప విశేషం. మొత్తానికి తన మధురమైన పాటలతో అశేషంగా శ్రోతలను ఆకట్టుకున్న బాలు ఇపుడు మోడీని పొగడడం ద్వారా ఎన్ని వర్గాల మద్దతు అందుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: