యంగ్ హీరోల్లో అందరికంటే బాగా వెనకపడిపోయిన హీరో నిఖిల్. ఈ కుర్ర హీరోకి మంచి హిట్ పడి చాలా కాలమైంది. గత సంవత్సరం రీమేక్ సినిమా కిర్రాక్ పార్టీ తో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా హిట్ అవడంతో మళ్ళీ ఫుల్ ఫాం లోకి వస్తాడనుకుంటే అంతా మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి  అక్కడే అన్నట్టుగా అయిపోయింది. ఇక ఈ హీరో నటించిన సినిమా అర్జున్ సురవరం. సినిమా షూటింగ్ అంతా పూర్తయిపోయి, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తరువాత వచ్చిన రక రకాల సమస్యలు, అవాంతరాల వల్ల విడుదల కాకుండా ఆగిపోయింది. సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకొని ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. అంతేకాదు సినిమా మీద కాస్త హైప్ వచ్చింది. తమిళంలో హిట్ అయిన
సినిమాకు రీమేక్ కావడంతో రిటన్స్ వస్తాయన్న అంచనాలు కూడా వచ్చాయి. కానీ ల్యాబ్ కే పరిమితం అన్నట్టుగా అయింది పరిస్థితి.

ఇదిలా ఉంటే ఒకవైపు నిఖిల్ కు కూడా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకొని మొదలు పెట్టిన శ్వాస సినిమా ఆగిపోయింది. కార్తికేయ కి సీక్వెల్ గా తీయాలనుకున్న సినిమా అలా పక్కనే పడి వుంది. దాంతో నిఖిల్ కూడా సైలంట్ అయిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో అర్జున్ సురవరం అవాంతరాలు ఒకటి ఒకటిగా తొలిగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తాజా సమాచారం. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే, సమస్యలు అన్నీ కొద్దిరోజుల్లో తొలిగిపోయి, అర్జున్ సురవరం విడుదలకు రెడీ అవుతుందని లేటెస్ట్ అప్‌డేట్.

ఈ సారి ముందుగా డేట్ ప్రకటించే ఆలోచన చేయడంలేదట చిత్ర బృందం. అన్నీ పక్కాగా క్లియర్ అయిన తరువాత  వారం లేదా పదిరోజుల ముందు రిలీజ్ డేట్ ప్రకటించి, ఫాస్ట్ గా ప్రమోషన్ చేసి, విడుదల చేసే ఆలోచనలో వున్నారట అర్జున్ సురవరం నిర్మాత ఠాగూర్ మధు.  ఒకవేళ ఈ సినిమా గనక రిలీజ్ అయితే ఆగిపోయిన శ్వాస, పక్కన పడి ఉన్న కార్తికేయ సీక్వెల్ మళ్ళీ మొదలయ్యో అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు మళ్ళీ మొదలైతే మాత్రం నిఖిల్ మళ్ళీ బిజీ అవుతాడంటున్నారు అందరు. 


మరింత సమాచారం తెలుసుకోండి: