ఎన్టీయార్ అంటే తెలుగు సినిమా కళామతల్లి ముద్దు బిడ్డ. ఆయన చేయని పాత్ర లేదు. పాత్రలు అన్ని కలసి కోరుకుని ఎన్టీయార్ని నటుడిగా ఎన్నుకున్నాయా అన్నంతగా ఆయన ఆ పాత్రలను మెప్పించారు. ఆయన ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర కనిపించేది. శ్రీరాముడు, శ్రీక్రిష్ణుడిగా, రావణుడిగా, భీముడిగా, భీష్ముడిగా  ఆయన పౌరాణికాల్లో రాణిస్తే, రాజుగా, సేనానిగా జానపదాల్లో మెరిశారు.


ఇక శ్రీక్రిష్ణదేవరాయలుగా, అశోక్ చక్రవర్తిగా కూడా రామారావు భళీ అనిపించారు. చాణక్యుడిగా చంద్రగుప్తునిగా కూడా వెలిగారు. బుద్దునిగా, వేమనగా సైతం కనిపించి అలరించారు. మరి ఇన్ని వందల చిత్రాలు ఇన్ని రకాల పాత్రలు వేసిన ఎన్టీయార్ కంటికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కనిపించలేదా అన్న డౌట్ అందరిలో వస్తోంది. పాత్రని విపరీతంగా ప్రేమించడంలో రామారావుకు సాటి ఎవరూ లేరు. ఆయన వేసిన పాత్రలు అలాంటివి మరి. ఇక మంచి పాత్ర కోసం ఆయన పోరాడిన సందర్భాలు ఉన్నాయి.

అల్లూరి సీతారామరాజు ఆయనకి ఇష్టమైన పాత్ర. దాన్ని సినిమాగా తీద్దామనుకున్నారు.  సూపర్ స్టార్ క్రిష్ణ తీయడంతో ఆయన మీద అలిగి చాన్నాళ్ళు మాట్లాడం మానేసారంటారు. అలాంటి  ఎన్టీయార్ ద్రుష్టికి ఉయ్యాలవాడ ఎందుకు కనిపించలేదన్నదే మళ్ళీ ప్రశ్న. రామారావు ఈ విషయంలో పరిశోధన చేయకుండా ఉండి ఉండరని కూడా అంటున్నారు. ఉయ్యాలవాడది అసలైన పోరాటం కాదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన పెన్షన్ కోసం చేసిన పోరాటం అని కూడా పేర్కొంటున్నారు.  


ఆయనకు ముగ్గురు భార్యలు. పాలేగాడిగా ఉంటూ అనుచరులతో 46 ఏళ్ల పాటు విలాసంగా బతికిన వారిగా చెబుతారు. అటువంటి ఉయ్యాలవాడను స్వాతంత్ర సమరయోధునిగా మార్చి తీసే సాహసం చేయలేకే రామారావు లాంటి పెద్దలు వూరుకుండిపోయారని కూడా అంటున్నారు. ఇపుడు సైరా మూవీ సైతం ఓ కాల్పనిక కధగానే చూడాలి అంటున్నారు.  ప్రజలను ముక్కుపిండి పన్నులు వసూల్ చేస్తూ అనేక అరాచకాలు, దురాగతాలకు పాల్పడిన పాలెగాళ్ళ వ్యవస్థను గ్రామాల్లో  రద్దు చేసి ప్రజలకు మేలు చేసిన నాటి ఈస్టిండియా కంపెనీ మీద పాలెగాళ్ళు పగపడితే వారిని హీరోలుగా చేసి స్వాతంత్ర సమరయోధులుగా చేయడం పట్ల చరిత్ర కారులు అభ్యంతర పెడుతున్నారు. ఏమైనా సైరా మూవీ మెగాస్టార్ హీరోచిత కధగానే చూడాలని అంటున్న వారు ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: