కమల్‌హాసన్‌ నటించిన 'ఆకలిరాజ్యం'లో  ఓ పాటలో 'చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్‌..' అంటూ ఓ కవి వివరిస్తాడు. ప్రస్తుతం అలాంటి అంశాన్ని దర్శకుడు మారుతి ఎంచుకున్నాడు. జీవితంలో చివరి ప్రయాణం చావు. అది పండుగలా ఎందుకు చేసుకోకూడదంటూ.. 'ప్రతిరోజూ పండుగ' అనే చిత్రాన్ని రూపొందించాడు. సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం సగానికి పైగా పూర్తయింది. మంగళవారంనాడు దర్శకుడు మారుతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వివరించారు.


'ఈరోజుల్లో' నుంచి ఒక్కసారి జర్నీ చూస్తే మీ గోల్‌ చేరుకున్నారనిపిస్తుందా?
'ఈరోజుల్లో' తీయడమే అప్పట్లో నా గోల్‌. దాని తర్వాత వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. 'ఈరోజుల్లో' టైంలో నాతో ఎవరైనా సినిమా తీయమని నిర్మాత వస్తారా! లేదా? అనేది వుండేది. ఆ తర్వాత డబ్బులుకూడా నాకు ఇస్తారని తెలిసింది. అట్లా జర్నీ ఒక్కో మెట్టుఎక్కుతూ సిన్సియారిటీతో గ్రాఫ్‌ పెరిగింది.


'శైలజారెడ్డి' సినిమా కరెక్టే అంటారా?
నేను చేసిన 'కొత్తజంట', బాబుబంగారం' 'శైలజారెడ్డి' హిట్‌ అవుతుందనే అనుకుంటాం. అయితే కొన్ని సినిమాలు ఎందుకు హిట్‌ అవుతాయో తెలీదు.'భలేభలేమగాడివోయ్‌' సినిమా ఏవరేజ్‌ అనుకున్నా. 'ప్రేమకథాచిత్రమ్‌' ఆడదనుకున్నా, అందుకే పేరు కూడా వేసుకోలేదు. ఇక 'ఈరోజుల్లో' సినిమా కేవలం నా సినిమా ఇలా వుంటుందని ఎవరైనా అడిగితే చూపిద్దామని డీవీడీగా చేసుకున్నా. ఇవన్నీ ఆలోచిస్తే జీవితంలో మనం ప్రయోగాలు చేస్తుంటాం. ఆ క్రమంలో మనకు తెలీకుండా కథలో జరిగే కొన్ని మార్పులు, కొంతమంది వ్యక్తులు పరిచయాలు, సూచనలతో అంతా మారిపోతుంటుంది.

బాగా రాసుకున్న కథను బాగా ఆడాలనుకుంటున్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి ఇలా చేయ్‌! అలాచేయ్‌! అంటూ గట్టిగా చెబుతారు. 'శైలజారెడ్డి' థియేటర్‌లో చూడలేదు. ఎందుకంటే నా సినిమా నాకు తెలిసిపోతుంది. తప్పుఅనేది తెలీయకుండా జరిగిపోయింది. అదెలాగంటే ఎదురుగా లారీ వస్తుంది. తప్పించుకోవడానికి పక్కన వీలులేదు. ఒకసైడ్‌గా వుంటే కనీసం రాసుకుంటూ పోతుంది. మనం సేఫ్‌గా వున్నామాలేదా అనేది మాత్రం అప్పుడు చూసుకోవాలి. అందుకే ఒక్కో నిర్మాత తన అనుభవాల్ని బట్టి ఈక్వేషన్స్‌ మారిపోతుంటాయి.


బౌండ్‌ స్క్రిప్ట్‌ సినిమాకు అవసరమా?
బౌండ్‌ స్రిప్ట్‌ అన్ని సందర్భాల్లో కుదరదు. యు.వి.క్రియేషన్స్‌ వంశీగారికి ఒక ఐడియా చెప్పగానే నచ్చితే లైన్‌ ఓకే చేసి. చేసేద్దాం అంటారు. కానీ అల్లు అరవింద్‌గారికి బౌండ్‌ స్క్రిప్ట్‌ చెప్పాలి. రెండున్నరగంటలు నెరేట్‌ చేయాలి. అప్పుడు కరెక్ట్‌గా తీర్పు ఇస్తారు. కొంతమంది వినే ఓపికలేకుండా ఐదు నిముషాల్లో వింటారు. మరికొందరు గంటసేపు వింటారు. ఇలా నిర్మాతను బట్టే కథలు చెప్పే విధానం మారిపోతుంటాయి. ఇంకొందరయితే దర్శకుడుపై నమ్మకంతో ఫ్రీడంగా వదిలేస్తారు. ఫైనల్‌గా నిర్మాత డబ్బులు ఇస్తాడు కాబట్టి ఆయన చెప్పినట్లు చేస్తాను. నా కెరీర్‌ అనేది ఆలోచించను. నిర్మాత సాటిఫై అయ్యాడాలేదా అనేది ఆలోచిస్తా.


'ప్రతిరోజూ పండగే' బౌండ్‌ స్క్రిప్టేనా?
ఇది బౌండ్‌ స్రిప్టే. తక్కువరోజుల్లోనే పర్‌ఫెక్ట్‌ చేసుకున్నా. నిర్మాతకు 10 నిముషాలే చెప్పా. దాన్ని సాయిధరమ్‌తేజ్‌కు చెప్పమంటే ఆయన 40 నిముషాలు విన్నారు. ఆ తర్వాత ఫుల్‌ నెరేషన్‌ విన్నారు. తనకు బాగా నచ్చింది. అరవింద్‌గారికి చెప్పగానే బన్నీవాసుగారు కూడా విని ఓకే చేశారు. ఆ తర్వాత చిరంజీవిగారికి చెప్పాను. గంట అనుకుంటే మూడు గంటలు చిరంజీవిగారు విన్నారు. 'ప్రేమకథాచిత్రమ్‌' సక్సెస్‌ తర్వాత చిరంజీవిగారు పిలిచారు. అప్పుడు ఆయనకు 'భలేభలే మగాడివోయ్‌' కథ చెప్పా. లోపాన్ని కూడా బాగా చెప్పావ్‌ అని కితాబిచ్చారు. అదేవిధంగా 'ప్రతిరోజూ పండగే' కథ విని ఫన్‌ వదలకుండా బాగా చేయ్‌ అని ధైర్యాన్నిచ్చారు. ఇది పూర్తిగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట కనెక్ట్‌ అవుతుంది. 


ఇప్పటి ట్రెండ్‌కు తగిన తాత మనవడు కథేనా ఇది?
ఇది అప్పటి తాత మనవుడు కథ కాదు. అప్పట్లోనే 'ఇంటింటి బాగోతం', 'తాత మనుడు' వంటి కథలు వచ్చేశాయి. నా బలం సమాజంలో జరుగుతున్న సంఘటలనే ఎంటర్‌టైన్‌మెంట్‌లో చూపిస్తుంటాను. ప్రతిరోజూ పండగేలోకూడా చావును కూడా సెలబ్రేషన్‌ చేసుకోవడం అనేది చెప్పాను. ఇలాంటిది ఇంతవరకు రాలేదు. ఇది ఇందులో చూస్తారు. వ్యక్తి చనిపోతే ప్రతిరోజూ పండుగ ఎలా చేసుకుంటారనేది చెప్పాను. చావు అనేది ఏడుపుకాదు. జీవితంలో చివరి జర్నీ. దాన్ని సంతోషంగా తల్లిదండ్రులకు ఇవ్వాలనేది పాయింట్‌.


'ఈరోజుల్లో'కూ ఇప్పటి చిన్న సినిమాకు వ్యత్యాసం ఎలా వుందంటారు?
చిన్న సినిమా అనేది రాను రాను సెక్ట్స్‌ లెవల్‌కు వెళ్ళిపోయింది. నేను ఆ సినిమాలో ద్వందార్థాలు పెట్టాను. అవి ఇప్పుడు యూట్యూబ్‌ పుణ్యమా అని ఎక్కువయ్యాయి. దాంతో చిన్న సినిమా అంటే కాస్త వల్గారిటీ వుండాలనే ఆలోచనలోకి దర్శక నిర్మాతలు వచ్చేశారు. 'ఆచార్య ఆత్రేయ', 'బ్రోచేవారెవరురా' సినిమాలు కూడా చిన్నవే కానీ చెప్పే విధానంలో చాలా ఆసక్తిగా చూపించారు.

అవి ఆడినాయికదా. ఏ సినిమాకైనా దర్శకుడి కష్టం ఒక్కటే. నటీనటులే తక్కువగా వుంటారు. చిన్న సినిమాలకు, ఫేమస్‌ ఫేస్‌లు లేకపోతే థియేటర్‌కు ఎవ్వరూ రారని ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇప్పటికే అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లో కావాల్సిన అంశాలు దొరుకుతున్నాయి. అంతకుమించి థియేటర్‌కు రావాలంటే ఏదో కొత్తదనం కావాలి. అందుకే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కోటి, రెండు కోట్లతో సినిమా తీసేయడం కరెక్ట్‌ కాదు. అలాంటివారు ఇండస్ట్రీలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: