ఈ మధ్య కరీనాకి హుషారెక్కువైపోయింది. ఒకప్పుడు ఎంత కదిలించినా పొడిపొడిగా మాట్లాడేది. చెప్పాలనుకున్నది చెప్పేసి తప్పుకునేది. ఇప్పుడలా కాదు. అన్నిటికీ ఉత్సాహంగా స్పందిస్తోంది. ఆ ఉత్సాహం ఎక్కువై ఒక్కోసారి మాట్లాడాల్సినదానికన్నా ఎక్కువ కూడా మాట్లాడేస్తోంది. ఇటీవల తన సినిమా అవకాశాల గురించి మాట్లాడింది కరీనా. అవి వింటే మిగతా హీరోయిన్లకు కోపం రావడం ఖాయం. ఎందుకంటే, ఇప్పుడు చాలామంది హీరోయిన్లు చేస్తున్న సినిమాలు, చేసి హిట్టయిన సినిమాలు తాను నో చెప్పినవేనట. గత పదేళ్లలో కరీనా చాలా సినిమాలకు నో చెప్పిందట. బిజీగా ఉండటం వల్ల ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను, నన్ను వెతుక్కుంటూ వచ్చిన చాలా సినిమాలకు నో చెప్పేశాను, అవి తర్వాత సూపర్ హిట్ అయ్యాయి, వాటిని మిస్ అయ్యానే అని కాసేపు ఫీలయ్యేదాన్ని కానీ నా చేతినిండా చాన్సులు ఉన్నప్పుడు బాధెందుకు అని వదిలేసేదాన్ని అని చెప్పుకొచ్చింది సుందరాంగి. తాను వద్దనుకున్న సినిమాల లిస్టు పెద్దదే చెప్పింది కరీనా. కల్ హో న హో, పేజ్ 3, చెన్నై ఎక్స్ ప్రెస్, ఫ్యాషన్ ఇలా చాలా ఉన్నాయట. పైగా ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తీసిన రామ్ లీల కూడా కరీనాయే చేయాల్సి ఉందట. కానీ టైమ్ లేక చేయలేకపోయాను అంది. ఆమె వదిలేసినవన్నీ హిట్టే ఎలా అయ్యాయో మరి. ఒక్కటి కూడా ఫట్టవలేదా, అయినా చెప్పడం లేదా? అయినా ఆమె చెప్పింది నిజమే అయితే సినిమాల ఎంపికలో కరీనా ఫెయిలయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ వదిలేసుకుని ఆమె ఏమీ గొప్ప సినిమాలు చేసేయలేదు. ఏవో కొన్ని గొప్ప సక్సెస్ లు తప్ప మరీ సూపర్బ్ సినిమాలేమీ లేవు ఆమె ఖాతాలో. మరి ఇంతదానికే అంతగా గొప్పలు పోవడం అవసరమా కరీనా!

మరింత సమాచారం తెలుసుకోండి: