టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. అదీ 2014 ఎన్నికల వరకు తప్పదని కేసీఆర్ భావిస్తున్నారు. తన కత్తికి రెండువైపులా పదునుందంటున్న కేసీఆర్ ... మొన్నటి వరకు కాంగ్రెస్ వెంట తిరిగి ఇప్పుడు బీజేపీతో కూడా సై అంటున్నారు. కాంగ్రెస్ మోసంచేసిందని, యూపీయే కాకుంటే ఎన్డీయే, ఎవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ వచ్చి తీరుందంటున్నారు. ఓవైపు కాంగ్రెస్, బీజేపీలతో కలిసి ఉంటూనే క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ ను బలంగా మార్చాలని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. ఉద్యమాన్ని ఉదృతం చేయాలంటే పార్టీ కేడర్ కూడా బలంగా ఉండాలని, దాంతో పాటు రేప హఠాత్తుగా ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాజకీయ శక్తిగా మారుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇందుకోసం తెలంగాణ జిల్లాలో దాదాపు 40 రోజులపాటు పల్లెబాట కార్యక్రమానని చేపట్టాలని నిర్ణయించారు. జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్డీయేతో కలిసి పనిచేసే అంశంపై కేసీఆర్ జేఏసీ నేతల అభిప్రాయం సేకరించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని బిజెపి చెబుతోంది కాబట్టి ఎన్టీయేను కూడా నమ్మితే ఏమవుతుందని అంటున్నారట. అయితే టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో మాత్రం ఇప్పటికీ ఢిల్లీ పెద్దలు టచ్ లోనే ఉన్నారని చెప్పారట. రాజకీయంగా టీఆర్ఎస్ బలపడి 100 అసెంబ్లీ, 14 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటే ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వచ్చినా, దిగొచ్చి తెలంగాణ ఇస్తారని కేసీఆర్ ధీమాగా ఉన్నారట. మొత్తానికి కేసీఆర్ కత్తికి రెండు వైపుల పదును ఉన్నట్టు తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న తనకు కూడా రెండు వైపుల నుంచి రాష్ట్ర సాధనకు అవకాశం ఉందని బలంగా విశ్వసిస్తున్నారు. మరి కేసీఆర్ రెండు పడవల ప్రయాణం ఏమేరకు ఫలితాన్నిస్తుందో త్వరలోనే తేలిపోయే అవకాశం ఉంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: