కేంద్రంలో పాగా వేయడమే అన్నాడీఎంకే లక్ష్యమని, ఈ దిశగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ అధినేత్రి జయలలిత పిలుపునిచ్చారు.సోమవారం జరిగిన అన్నాడీఎంకే రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశంలో 25 తీర్మానాలను ఆమోదించారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు భారతరత్న ఎంజీఆర్ పిలుపు మేరకు తాను రాజకీయాల్లో ప్రవేశించి ముప్పయి ఏళ్లు అవుతోందని, ఇందులో పాతిక సంవత్సరాలు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఎంజీఆర్ ఆశయాలను తప్పకుండా పాటించానన్నారు. ప్రజలు అందిస్తున్న సహకారంతో మూడుసార్లు ముఖ్యమంత్రినయ్యానని జయలలిత పేర్కొన్నారు. తమ పార్టీ ప్రజలకోసం పురుడుపోసుకుందని, ఒకరి దయపై ఆధారపడాల్సిన అవసరం లేదని, అయితే కొన్ని పార్టీలు జాతీయ పార్టీలను నమ్ముకున్నాయని ఆమె పరోక్షంగా డీఎంకేని ఎత్తి పొడిచారు. అన్నాడీఎంకే ద్వితీయశ్రేణి నాయకులు, సర్వసభ్య సభ్యులు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో అన్నాడీఎంకే సుప్రీం జయలలిత మాట్లాడుతూ జాతీయ పార్టీల ప్రమేయం లేకుండా 2014లో లోక్‌సభకు జరుగనున్న ఎన్నికలో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. అజాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ కూటములు వున్నాయని, కొన్ని పార్టీలు కాంగ్రెస్‌తోనూ, మరికొన్ని పార్టీలు బీజేపీతోను చేతులు కలిపాయని, అయితే అన్నాడీంకే అలా కాకుండా ఒంటరిగానే పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొంటుందని ఆమె స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: