రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట పొందుపర్చే బృహత కార్యక్రమానికి ఏపీ సర్కార్‌ శ్రీకారం చుడుతోంది. ఈ భారీ కార్యక్రమానికి ‘పీపుల్స్‌ హబ్‌’ అన్న పేరును ఖరారు చేసింది. ఈమేరకు సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 

ఒరాకిల్‌ వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. కేబినెట్‌ భేటీ వివరాలను సీఎం చంద్రబాబు స్వయంగా విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పీపుల్స్‌ హబ్‌లో పొందుపర్చనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు, వంట గ్యాస్‌ లబ్ధిదారుల వివరాలు, తదితరాలను ఆధార్‌ అనుసంధానం ద్వారా సేకరించి వాటిని పీపుల్స్‌ హబ్‌లో పొందుపరుస్తామన్నారు.

 

ఈ ప్రాజెక్టుకు రూ.14కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. మే 20లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విభాగాల కంప్యూటరీకరణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే 134 ప్రభుత్వ విభాగాల కంప్యూటరీకరణను ప్రారంభించామని త్వరలోనే వాటిని పూర్తి చేస్తున్నట్టు చెప్పారు.

 

భవిష్యత్తులో అన్ని సేవలకూ పీపుల్స్‌ హబ్‌ను అనుసంధానిస్తామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో పల్స్‌ సర్వే చేపడతామని తెలిపారు. ఏ సామాజిక వర్గంలో ఎంత మంది పేదలున్నారు, వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే వివరాలు సేకరిస్తామన్నారు. ఆ వివరాలను కాపు రిజర్వేషన్‌ కోసం నియమించిన మంజునాథ కమిషన్‌కు అందజేస్తామని తెలిపారు. పీపుల్స్‌ హబ్‌తో సమాంతరంగా ల్యాండ్‌ హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.

 

 

కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు.. 

  • అర్జున్ అవార్డు గ్రహీత, పోలీస్‌ బాక్సింగ్‌ కోచ్‌ శీరా జయరాంకు విశాఖలోని ఎండాడలో 500 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ నిర్ణయం.
  • అనంతపురం జిల్లాలో పవన విద్యుత్తు ప్రాజెక్టుల స్థాపనకు నాన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ కార్పొరేషన్‌, అనంత సాగర్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు సంయుక్తంగా వేర్వేరు చోట్ల 98.58 ఎకరాలు 25 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయింపు.
  • గుంటూరు జిల్లాలో నూతన బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైను, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి 16.45 ఎకరాల భూమిని రైల్వే శాఖకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం.
  • చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని మల్లవారి పాలెం గ్రామంలో ట్రిపుల్‌ ఐటీ స్థాపనకు 35.09 ఎకరాలను సాంకేతిక విద్యా శాఖకు ఉచితంగా కేటాయిస్తూ నిర్ణయం.
  • ఎన్టీఆర్‌ సంచార వైద్యం పేరిట ఈనెల 20న 275 వాహనాలను ప్రారంభించాలని నిర్ణయం. డాక్టర్లు, వైద్య సిబ్బందితో ఈ వాహనాలు గ్రామాలకు వెళ్లి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తాయి. ప్రతి గ్రామానికి నెలలో రెండు సార్లు ఈ వాహనం వెళ్తుంది. అలాగే సరిగా పనిచేయని 193 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను పీపీపీ విధానంలో ప్రాథమిక హెల్త్‌ సెంటర్లుగా మార్చాలని నిర్ణయం.
  • చిత్తూరు జిల్లాలోని చిత్తూరు ఆస్పత్రిని ఇప్పటికే ఐదేళ్ల లీజు ప్రాతిపదికన అపోలోకి ఇవ్వగా... తాజాగా దాన్ని 35 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం.
  • గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కేన్సర్‌ యూనిట్‌ ఏర్పాటుకు అనుమతి. నాట్కో సంస్థ రూ.16.5కోట్లతో స్వచ్ఛంధంగా ఈ విభాగం ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో కేన్సర్‌ సేవల విభాగం ఏర్పాటు ఇదే తొలిసారి.
  • రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా పది ఎకరాల లోపు ఉండే హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్‌ సెంటర్లు, వే సైడ్‌ ఎమినిటీస్‌ ఏర్పాటుకు భూ లీజు విధానం మార్పునకు నిర్ణయం. ప్రస్తుతం ఉన్న లీజు కాల పరిమితి 33ఏళ్లుగా ఉంది. వారి పనితీరు బాగుంటే అదే ఒప్పందం మీద మరో 33 ఏళ్లు దానిని పొడిగించాలని ప్రభుత్వం తాజాగా చేసిన మార్పులో పేర్కొంది. కొత్తగా ఏర్పాటుచేసే వాటికి వాస్తవ ధరలో రెండు శాతం బిడ్డింగ్‌ కనీస ధరగా నిర్ణయించి, ఎక్కువ మొత్తం కోట్‌ చేసిన వారికి వారి ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాన్ని పరిశీలించి భూ కేటాయింపులు చేస్తారు.
  • రాష్ట్రంలో నెలకొల్పనున్న హీరో మోటార్స్‌ సంస్థకు, ఆగ్జిలరీ యూనిట్స్‌కు 600 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం. వీటి ద్వారా రూ.3200 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 15వేల ఉద్యోగావకాశాలు వస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: