తెలంగాణ ఇరిగేష‌న్ శాఖ మంత్రి హ‌రీశ్ రావు ఇప్పుడు తీవ్ర అంసతృప్తితో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది! ఇందుకు గల కార‌ణం ఎంటానీ అలోచిస్తే, దాదాపుగా అంద‌రికి వ‌చ్చే డౌట్ ఒక్క‌టే. ఆయ‌న శాఖ మార్పు విషయ‌మే. కానీ శాఖ మార్పు విష‌య‌మేకాదు, ఆయ‌న మంత్రిగా ఉన్న మిష‌న్ కాక‌తీయ రెండో ద‌శ ప‌నులు ఆయ‌న‌కు ట్ర‌బుల్స్ తెప్పిస్తున్నాయ‌ట‌! ప్ర‌జాప్ర‌తినిధుల్లో మొద‌టి ద‌శ‌లో క‌నిపించిన ఉత్సాహం ఇప్పుడు క‌నిపించ‌డం లేద‌ట‌. జెట్ స్పీడ్ లా హరీశ్ రావు, డెడ్ స్లోలా అధికారులు వ్య‌వ‌హరిస్తున్నార‌ని తెలుస్తోంది. తెలంగాణ ప్ర‌భుత్వానికి దేశ వ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చిన ప‌థ‌కం మిష‌న్ కాక‌తీయ‌. తెలంగాణ లో గ‌తంలో కాక‌తీయ రాజులు క‌ట్టించిన గొలుసుక‌ట్టు చెరువులు ఇప్పుడు క‌నిపంచకుండా పోయాయి. అయితే ఈ చెరువుల‌ను పున‌రుద్ద‌రించి పూర్వ‌వైభం తీసుకు రావ‌డమే మిష‌న్ కాక‌తీయ ముఖ్య ఉద్దేశం. ప్ర‌తి  చెరువును నీటితో నింపే ప‌థ‌క‌మే ఈ మిష‌న్ కాక‌తీయ‌. ప్ర‌తిఏటా ప‌దివేల చెరువుల‌ను పున‌రుద్ద‌రించి పూర్వ‌వైభ‌వం తీసుకురావాల‌న్న‌ది ప్ర‌భుత్వ సంకల్పం. 


మిష‌న్ కాక‌తీయ ప‌నులకు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఆశ‌క్తి చూప‌డం లేదు...


ఇందులో భాగంగా మొద‌టి ఏడాది అనుకున్న ల‌క్ష్యాన్ని దాదాపు సాధించింది. ఇందులో భాగంగా మొదటి ఏడాది అనుకున్న లక్ష్యాన్ని దాదాపు సాధించింది. ఇక ఇప్పుడు రెండో దశ పనులు ప్రారంభమయ్యాయి. అయితే పేరుకే ప్రారంభ‌మ‌య్యాయి కానీ, ప‌నులు మాత్రం జ‌ర‌గ‌డం లేదు. ఇదే మంత్రి హ‌రీశ్ రావుకు కోపం తెప్పిస్తోంది. ప‌నులు స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. మిష‌న్ కాక‌తీయ మొద‌టి  ద‌శ‌లో ఉత్సాహాన్ని అటు అధికారులు కానీ, ఇటు ప్ర‌జా ప్ర‌తినిధులు కానీ చూప‌డం లేదు. చురుగ్గా పాల్గొన‌డ‌మూ లేదు. చాలా జిల్లాల్లో ఇంకా మొద‌టి ద‌శ ప‌నులే పూర్తి కాలేదు. త‌ర‌చూ స‌చివాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ల పెడుతున్న హ‌రీశ్ రావు అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు. నిర్లిప్త‌త‌తో ఉన్న అధికారులకు క్లాస్ తీసుకుంటున్నారు. ఇది బాగానే ఉంది కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం అనుకున్నంత ఫ‌లితం రావ‌డం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? ప‌నులు న‌త్త‌నడ‌క‌న ఎందుకు సాగుతున్నాయి? స‌ందేహ నివృత్తి కోసం హ‌రీశ్ రావు పూర్తి స్థాయిలో ఆరా తీశారు. హ‌రీశ్ రావు విచార‌ణ‌లో దిమ్మ‌దిరిగే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. 


 2 % క‌మిష‌న్ ఇస్తేనే ప‌నుల‌కు ఎమ్మెల్యే లు వ‌స్తున్నారు...


చెరువు పూడిక‌తీత ప‌నుల విష‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల‌లోని ఎమ్మెల్యేలు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని తేలింది. స్థానిక నేత‌లు కూడా ప‌నుల్లో అంటీముట్ట‌న‌ట్టుగా ఉంటున్నార‌ట‌. ఇక కొంత మంది శాస‌న స‌భ్యులైతే మ‌రీనూ ప‌ర్సెంటేజ్ ల‌ను డిమాండ్ చేస్తున్నార‌ట. మినిమ‌మ్  2 ప‌ర్సెంట్క‌ మిష‌న్ ఇస్తే కానీ మిష‌న్ కాక‌తీయ పనుల‌కు కొబ్బ‌రికాయ కొట్ట‌డం లేదు. కొంద‌రైతే మూడు శాతం అడుగుతున్నార‌ని తేలింది. అలా ప‌ర్సెంటేజీలు ఇవ్వ‌ని కాంట్రాక్ట‌ర్ ప‌నుల‌ను కావాల‌నే జాప్యం చేస్తున్న‌ట్లు హ‌రీశ్ రావు విచార‌ణ‌లో తెలిసింది. వీట‌న్నింటిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి హ‌రీశ్ రావు తీసుకువెళ్లిన‌ట్టు స‌మాచారం. ఎక్క‌డెక్క‌డ ప‌నుల‌లో జాప్యం అవుతుంది?  ప్రజా ప్ర‌తినిధులు ఎందుకు ఉత్సాహంగా పాల్గొన‌డం లేదు? ఇలాంటివి పూర్తి వివ‌రాల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్లారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే ను చాలా మంది స్థానిక నేత‌లు 2 ప‌ర్సెంట్ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ కూడా  చేస్తున్నార‌ట‌! 2  ప‌ర్సెంట్ ఇవ్వ‌నిదే  స‌ద‌రు శాస‌న స‌భ్యుడు కొబ్బ‌రికాయ కొట్టడం క‌దా క‌నీసం  అటు వైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేద‌న్న వాద‌న‌లు ఉన్నాయి.


అల్టిమేటం ఇచ్చినా ప‌నుల్లో వేగం పెర‌గ‌డం లేదు....
ఎన్నిసార్లు  ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లినా ఆ కార్య‌క్ర‌మం ఉంది. ఈ కార్య‌క్ర‌మం ఉంది అంటూ త‌ప్పించుకు తిరుగుతున్నారట‌. ఇలా ఎక్కడిక‌క్క‌డ కాంట్రాక్ట‌ర్ల‌కు ప్ర‌జా ప్ర‌తినిధులు అడ్డుప‌డుతున్నారు. పనుల‌లో వేగం ఎందుకు పెంచ‌డం లేద‌నే వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రి కి పూస‌గుచ్చిన‌ట్టు చెప్పార‌ట మంత్రి హ‌రీశ్ రావు. మొద‌టి ద‌శ ప‌నులు ఈ నెల 30 లో పూర్తి చేయాల‌ని మంత్రి హ‌రీశ్ రావు అల్టిమెటం జారీ చేసినా ప‌నుల్లో వేగం మాత్రం పెర‌గ‌డం లేదు. అందుకే మొద‌టి ద‌శ‌లో మిష‌న్ కాక‌తీయ కు చేసిన హ‌డావుడి...  వ‌చ్చినంత పేరు ఇప్పుడు రావడంలేదు. మిష‌న్ కాక‌తీయ మొద‌టి ద‌శ ప‌నుల్లో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు అంద‌రూ చెరువుల ద‌గ్గ‌రే క‌నిపించేవారు. అయితే రెండో ద‌శ‌కు వ‌చ్చే స‌రికి సీన్ పూర్తిగా మారిపోయింది. ఏప్రిల్ నెల ముగుస్తోంది. మే నెల వ‌చ్చేస్తోంది. చాలా చెరువులు ఇంకా టెండ‌ర్లు ద‌గ్గ‌ర ఉండ‌ట‌మో, ప్ర‌పోజ‌ల్స్ ద‌గ్గ‌ర ఉండ‌ట‌మో జ‌రుగుతోంది. వీట‌న్నింటిపై హ‌రీశ్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జెట్ స్పీడ్ లా హ‌రీశ్ దూసుకుపోతుంటే.. డెడ్ స్లోలా అటు అధికారులు, ఇటు ప్ర‌జా ప్ర‌తినిధులు వ్య‌వ‌హరిస్తున్నారు. 


ఫోన్ ల ద్వారా ఎమ్మెల్యే ల‌కు వార్నింగ్ ఇస్తున్న హ‌రీశ్ రావు...
ప‌రిపాల‌న  అనుమ‌తులు వ‌చ్చి అంతా స‌వ్యంగా ఉన్న చెరువుల ద‌గ్గ‌ర కొబ్బ‌రి కాయ కొట్టడానికి  కూడా మీకు తీరిక దొర‌క‌డం లేదా అంటూ ఓ ఎమ్మెల్యే పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి హ‌రీశ్ రావు. మ‌రో నెల గ‌డిస్తే ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండు ఏళ్లు అవుతుంది. ఇంకా మొద‌టి ద‌శ‌లో మిగిలిపోయిన చెరువులు  చాలా ఉన్నాయి. రెండో ద‌శ కూడా  ఇంకా చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌లో మొద‌లు పెట్ట‌లేదు. ఇలా అయితే చాలా క‌ష్ట‌మ‌ని, భ‌విష్య‌త్తులో మీకే న‌ష్టం అంటూ అంద‌రికీ ఫోన్ లు చేస్తూ హెచ్చ‌రిక‌లు పంపుతున్నారు హరీశ్ రావు. మ‌రీ ముఖ్యంగా క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి, వ‌రంగ‌ల్ జిల్లాలు ఇంకా టెండ‌ర్ల ద‌శ‌లోనే ఉన్నాయట‌. టెండ‌ర్లు పూర్తి చేసి, కాంట్రాక్టు సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుని, ప‌నులు ప్రారంభించ‌డానికి ఇంకా ఎంత స‌మ‌యం తీసుకుంటారంటూ మంత్రి హరీశ్ కోపంతో ప్ర‌శ్నిస్తున్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో రెండో ద‌శ మిష‌న్ కాక‌తీయ ప‌నుల‌లో భాగంగా 1,053 చెరువుల‌కు పరిపాల‌నా అనుమ‌తులు ఇస్తే, 921 చెరువుల‌కు మాత్ర‌మే టెండ‌ర్లు పిలిచారు. వీటిలోనూ 544 చెరువుల‌కు మాత్ర‌మే అగ్రిమెంట్లు పూర్తి అయ్యాయి. 


అందులోనూ 262 చెరువుల మ‌ర‌మ‌త్తుల‌కు మాత్ర‌మే ప‌నులు ప్రారంభం అయ్యాయంటే  ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక మ‌హ‌బూబ్ న‌గ‌ర్ సంగ‌తి అయితే  చెప్ప‌నే అక్క‌ర్లేదు. 1,530 చెరువుల‌కు ప‌రిపాల‌నా అనుమ‌తులు ఇస్తే 1,215 చెరువుల‌కు మాత్ర‌మే టెండ‌ర్ల పిలిచారు. 495 చెరువుల‌కు అగ్రిమెంట్లు పూర్త‌య్యాయి. అయితే 267 చెరువుల‌కు మాత్ర‌మే ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. అంటే వంద‌లో క‌నీసం పావువంతు కూడా ఇంకా ప‌నులు మొద‌లు కాలేదు. వీట‌న్నింటికీ కార‌ణాలేమిటో ఇప్ప‌టికే అర్థ‌మ‌య్యి ఉంటుంది. ప్ర‌జాప్ర‌తినిధుల నిర్లిప్త‌త‌, నిర్లక్ష్యం, నిరాస‌క్త‌త వ‌ల్లే  మిష‌న్ కాక‌తీయ ప‌నులు న‌త్త‌న‌డ‌క న‌డుస్తున్నాయి. త‌మ‌కు లాభం లేని ప‌నుల ప‌ట్ల ప్ర‌జాప్ర‌తినిధులు ఇంట్ర‌స్టు చూప‌డం లేద‌ని చాలా మంది అధికారులు హ‌రీశ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ తతంగమంతా గులాబీ నేత కేసీఆర్ కూడా తెలిసిపోయింది. మరి  ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: