ఆంధ్రపదేశ్ ప్రజలతో బీజేపి, కాంగ్రెస్ పార్టీలు చెడుగుడు ఆడుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలో.. కాంగ్రెస్ వైఖరినే బీజేపి అనుసరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 10ఏళ్ల యుపీఏ పాలను ఓసారి నెమరువేసుకుంటే.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. దానికి రెండు పరిష్కారాలు ఆలోచించడం కాంగ్రెస్ పార్టీ నైజం. ముందుగా ఒక దానిని తమ పార్టీ లీడర్లతో లీక్ చేయించేది. ప్రజల నుండి సానుకూల స్పందన వస్తే.. దానినే అమలు చేసేది. అలా కాకుండా ప్రజల నుండి ప్రతికూల స్పందన వస్తే.. తమ అభిమతం అది కాదని, రెండో పరిష్కారాన్ని చూపి తప్పుకునేది. యుపిఏ పాలనలో ఆంధ్రులకు ఇలాంటి అనుభవాలెన్నో ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపి కూడా తాము కాంగ్రెస్ కు ఏ మాత్రం తక్కువ కాదని.. చెప్పకనే చెబుతోంది.
 
కొద్దిరోజులుగా ఏపీ ప్రత్యేక హోదాపై ఢిల్లీలో జరిగిన పరిణామాలపై కేంద్రమంత్రి సుజనా చౌదరి గురువారం ప్రెస్ మీట్ పెట్టారు. తాము వంద శాతం ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లు చెప్పారు. 14వ ఆర్ధిక సంఘం నివేదిక తరువాత బడ్జెట్ కేటాయింపుల స్వరూపం మారిపోయిందని, అందువల్ల ప్రత్యేక హోదా ఎలా ఇవ్వాలనే దానిపై కేంద్రం కసరత్తు చేస్తోందని చెప్పారు. కాని పక్షంలో ఎంత అదనపు సాయం ఇవ్వాల్సి వస్తుందన్న దానిపై కేంద్రం లెక్కలేస్తోందన్నారు. రాష్ట్రానికి చేరూక్చే ప్రయోజనాలపై సాధ్యాసాధ్యాలను చూసుకుని రెండు,మూడు రోజుల్లో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. 


సుజనాచౌదరి ప్రెస్ మీట్ పై రాజకీయ విశ్లేషకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  తమ డిమాండ్ ప్రత్యేక హోదానే అన్న సుజనా చౌదరి.. కాని పక్షంలో అంటూ మెలిక పెట్టడం సరికొత్త చర్చకు తెర లేపింది. సుజనా చౌదరి ప్రెస్ మీట్ ముమ్మాటికి బీజేపి వ్యూహమేనన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హో దా ఇవ్వలేకుంటే.. ప్యాకేజీ ద్వారా ఎంత మొత్తం సాయం చేస్తారో.. లీక్ చేయించడమే సుజనా ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశమని విశ్లేషకుల భావన. ఈ ప్రకటన తరువాత ప్రజల నుండి, ముఖ్యంగా రాజకీయ నేత(పవన్ కల్యాణ్ )ల నుండి వ్యతిరేకత రాకుంటే.. ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకోవచ్చనేది కమల నాధుల వ్యూహంగా వారు అభివర్ణిస్తున్నారు.

అలా కుండా అటు ప్రజలు, ఇటు రాజకీయ నేతలు (పవన్ కల్యాణ్) నుండి వ్యతిరేకత వ్యక్తమైతే.. ఆ ప్రకటను తమకు ఎలాంటి సంబంధం లేదని తప్పుకోవచ్చు. తాము ఎంచుకున్న రెండో పరిష్కార మార్గాన్ని ప్రకటించవచ్చు. అయితే అటు.. లేకుంటే ఇటు అన్న ధోరణితో వ్యహరించి సమస్య నుండి గట్టెక్క వచ్చనేది బీజేపి ప్లాన్ గా విశ్లేషకులు చెబుతున్నారు. 


సుజనా చౌదరి ప్రెస్ మీట్ ఏం చెబుతోంది ? అసలు ఆయన ఏ హోదాలో ఏపీకి స్పెషల్ స్టేటస్ పై ప్రెస్ మీట్ పెట్టారు. కేంద్రమంత్రిగానా, లేక టీడీపీ ఎంపీ గానా? కేంద్రమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి ఉంటే.. కేంద్రం మాట.. ఆయన నోట వెలువడినట్లు భావించాలా? లేక టీడీపీ ఎంపీ గా అయితే.. కేంద్రం నుంచి ఈ పాటికే పార్టీ అధినాయకత్వానికి స్పష్టమైన సంకేతాలు వచ్చాయనుకోవాలా? ఇదే ప్రశ్న ప్రతీ ఆంధ్రుడిలోనూ వ్యక్తమౌతోంది. యుపీఏ, ఎన్టీఏ దొందూ దొందేనన్న విమర్శలు అక్కడి ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా కాపీ, పేస్ట్ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి.. తమకు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలని ఎన్డీఏ సర్కార్ ను ఏపీ ప్రజలు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: