ఏ ఎన్నికల్లో అయినా గెలుపోటములు సహజం. కానీ, ఆ ఎన్నికలను నిర్వహించే అధికారులు సక్రమంగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారా లేదా ఎన్నికలకు వినియోగించే ఓటింగ్ యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని పరీక్షించడం, ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థులు ఎన్నికల సమయంలో నియమ నిబంధనలను పాటిస్తున్నారా లేదా అని డేగ కన్నుతో చూడటం, ఇవన్నీ సమర్ధవంతమగా నిర్వహించేలా పోలీస్ వ్యవస్థను వినియోగించుకోవడం, ఇలా ఎన్నో పనులను సమన్వయంతో అత్యుత్తమంగా ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై ఉంటుంది.


నంద్యాలలో జరిగిన ఉపఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రలోభాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైన ఎన్నికల అధికారులు, పోలింగ్ రోజు ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారు. ఉపఎన్నిక నిర్వహించిన తీరును మాత్రం ప్రతి ఒక్కరు ప్రశంసించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వీవీపాట్ ఓటింగ్ యంత్రాలతో పాటు, డ్రోన్ లను , ప్రతి పోలింగ్ కేంద్రంలో వీడియో కెమెరా లను పెట్టి గట్టి నిఘా ఉంచి ఎంతో పకడ్బందీగా కేంద్ర బలగాల సహకారంతో ఎన్నికలను నిర్వహించారు. ఓటర్లందరికీ స్లిప్పులు అందేలా చేసి ప్రతి ఒక్కరు తమ ఓటుని ఎటువంటి ఇబ్బంది పడకుండా వినియోగించుకునేలా సఫలీకృతం అయ్యారు.


కానీ, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పాడుబడ్డ  ఓటింగ్ యంత్రాలను తీసుకొచ్చారు. చాలా యంత్రాలతో నోటా బటన్ పనిచేయపోవడంతో ఓటర్లు తీవ్ర నిరాశకు గురవుతుంటే, మరి కొందరు అయితే తాము వేసే ఓటు ఈ పని చేయని యంత్రాల వల్ల  ఏ పార్టీ కి పడుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క ఓటర్లు ఓటు వేయడానికి క్యూ లో నిలుచొని ఉంటే, అధికార పార్టీ అభ్యర్థులు పార్టీ గుర్తుతో పాటు వచ్చి పోలింగ్ కేంద్రాల్లోనే ప్రచారం నిర్వహిస్తున్నా, అటు పోలీస్ లుగాని ఇటు ఎన్నికల అధికారులు గాని అస్సలు పట్టించుకోవడం లేదని ప్రత్యర్థి అభ్యర్థులు వాపోతున్నారు.


ఇది ఇలా ఉంటే, చాలా మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుండి గల్లంతయ్యాయి. కొందమంది కి ఓటు వేయటానికి అవసరమయ్యే స్లిప్పులు అందలేదు. మరి కొంత మందికి స్లిప్పులు అందినా, అవి తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళితే, మీ ఓటు ఇక్కడ లేదని తిప్పి పంపిస్తున్నారు. దీంతో రెండు మూడు పోలింగ్ కేంద్రాలకు తిరిగి విసుగు చెంది చాలా మంది ఓటర్లు తమ ఓటుని వినియోగించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. 


కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై మూడు గంటలైనా, పోలింగ్ శాతం 10 నుండి 15 శాతం మాత్రమే నమోదు అయ్యింది. ఇది అక్కడ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మొత్తానికి నంద్యాల్లో ఎంతో పకడ్బందీగా ఉపఎన్నికలు నిర్వహించిన ఎన్నికల అధికారులు, కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికని గాలికి వదిలేసి చోద్యం చూస్తూ, అంత సమర్ధవంతంగా నిర్వహించ లేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: