అప్పట్లో విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ దివంగత నటుడు నందమూరి తారక రామరావు గారు తెలుగు దేశం పార్టీని పెట్టి రాష్ట్రంలో ఎలాంటి సంచలనాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా తొమ్మిదిన్నరేళ్ళ క్రితం 2008 లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినపుడు కూడా అంతకంటే మతిపోయేరీతిలో సంచలనాలు నమోదవుతాయి, రాజకీయాలను చిరంజీవి శాసిస్తాడు అని అందరూ ఊహించారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ 2009 లో జరిగిన ఎన్నికలలో  చిరు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక చిరు ఎన్నికల ప్రచారానికి మేనల్లుడు అల్లుఅర్జున్ నుండి తమ్ముడు పవన్ కల్యాణ్ వరకు అందరూ పాల్గొని తమవంతు కృషి చేశారు.


అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఒకరినొకరు విమర్శించుకొనబోతున్నారు. అది ఎలాగంటారా! త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికలకు సంబందించి ప్రచార పర్వంలో భాగంగా ఇద్దరూ వేరు వేరు పార్టీల తరపున పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. సరిహద్దు రాష్ట్రాలయిన కర్ణాటక, తమిళనాడులలో  తెలుగు హీరోలకు మాంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దుల్లో ఉండే కోలార, బళ్లారి, రాయ్ చూర్, చిక్ బళ్లాపూర్  వంటి చాలా  ప్రాంతాల్లో మెగా ఫ్యామిలీ హీరోలకి పెద్దఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఇదే అదునుగా చేసుకుని గత ఎన్నికలలో చిరంజీవితో ప్రచారం చేయించుకొని తెలుగువాళ్ళ ఓట్లనన్నిటినీ దండుకొని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇదే ఫార్ములాను వాడుకుని మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకునే యోచనలో కాంగ్రెస్ ఉండని టాక్.


తామూ ఏమి తక్కువ తినలేదన్నట్లుగా మరో మెగా హీరో పవన్ కల్యాణ్ తో ప్రచారం నిర్వహించడానికి రెడీ అయింది జేడీయస్. ఇదే విషయాన్ని జేడీయస్ అధ్యక్షుడు కుమారస్వామి మీడియా సమావేశంలో తెలియజెప్పారు. పవన్ ఇలా ఒప్పుకోవటంలో స్వార్థం లేకపోలేదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదెలా అంటే పవన్ గత ఎన్నికల ముందే పార్టీని పెట్టినా ప్రత్యక్ష రాజకీయాలలోకి ఇప్పుడిప్పుడే అడుగుపెట్టాడు. రాజకీయంగా ఇంకా అనుభవం గడించలేదు కాబట్టి ఇలా ప్రచారం అయినా చేస్తుండడంవల్ల దేశరాజకీయాలు సైతం అర్థం చేసుకుని, నేర్చుకొనే వీలు కలుగుతున్నందువల్ల ఒప్పుకొనినట్లు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. గతంలో  ఇద్దరూ కలిసి ప్రచారం చేసినవాళ్లు ఇప్పుడు ఒకరినొకరు ఎలా విమర్శించుకొంటారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: