తెలుగుదేశంపార్టీలో ఆర్దిక నేరగాళ్ళు ఎక్కువైపోతున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బయటనడిన ఎంఎల్సీ అన్నం సతీష్ వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వ్యవహారం చూస్తుంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత నిజమవుతున్నట్లే కనిపిస్తోంది. తెలుగుదేశంపార్టీలోని కీలక స్ధాయిలోని నేతలు వందలు, వేలు, కోట్ల రూపాయలను బ్యాంకుల్లో మోసం చేస్తుంటే జిల్లా స్ధాయిలోని కొందరు నేతలు చిలకొట్టుడు కొడుతున్నారు. అందుకు కూడా బ్యాంకులనే మోసం చేస్తున్నారు.

 

తాజాగా బయటపడిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లాలోని బాపట్లకు చెందిన టిడిపి ఎంఎల్సీ అన్నం సతీష్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)లో రుణం తీసుకునేందుకు సంబంధించిన భూమి పత్రాలు నకిలీవని తేలింది. రూ 24 కోట్ల రుణం కోసం ఎంఎల్సీ సమర్పించిన 11 ఎకరాలకు సంబంధించిన అన్నీ పత్రాలు లేకపోయినా లోన్ మాత్రం శాంక్షన్ అయిపోయింది. అదే మామూలు వ్యక్తులెవరైనా పది వేల రూపాయల లోన్ కోసం బ్యాంకుకు వెళితే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తారు. సమర్పించిన పత్రాలు అన్నీ సరిగానే ఉన్నా ఎక్కవో ఒక కాగితంలో సంతకం సరిగా లేదన్న కారణంతో లోన్ ఆపేసే బ్యాంకులు సరైన పత్రాలు ఇవ్వకపోయినా రూ 24 కోట్ల రుణం ఎలా మంజూరు చేసిందో అర్ధం కావటం లేదు. పైగా అందులో రూ 5 కోట్లు విడుదల కూడా చేసేశారు.

 

నిజానికి సరైన పత్రాలు ఇవ్వకుండానే లోన్ తీసుకున్నందుకు ఎంఎల్సీపై బ్యాంకు చీటింగ్ కేసు పెట్టాలి. కానీ కేసంటూ పెడితే తాము కూడా ఇరుక్కుంటామన్న భయంతో బ్యాంకు ఉన్నతాధికారులు కేసు పెట్టటానికి వెనకాడుతున్నారు. అందుకనే లోన్ లో తీసుకున్న 5 కోట్లను వెనక్కిచ్చేస్తే ఎవరికీ ఎటువంటి సమస్య లేకుండా సర్దుబాటు చేసుకోవచ్చని సూచించటం విచిత్రంగా ఉంది. అంటే బ్యాంకును మోసం చేసిన టిడిపి నేతపై కేసు లేకుండా ఒత్తిళ్ళు మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోంది.

 

బ్యాంకులను మోసం చేయటం సతీష్ తోనే మొదలుకాలేదు. ఎంపిలు రాయపాటి సాంబశివరావు , సుజనాచౌదరి, సిఎం రమేష్, ఎంఎల్సీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళ భాగోతాలు ఇప్పటికే బయటపడ్డాయి. పైన చెప్పిన నేతలంతా బ్యాంకులను లూటీ చేసి దర్జాగా తిరుగుతున్న వారే. ఎవరిపైనా ఏ బ్యాంకు కూడా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాబట్టే ద్వితీయ శ్రేణి నేతలు కూడా బ్యాంకులను ధైర్యంగా మోసం చేయగలుగుతున్నారు.

 

పార్టీలోని కీలక నేతలు వేల కోట్ల రూపాయల ప్రజాధానాన్ని లూటీ చేస్తున్నట్లు సాక్ష్యాలతో బయపడుతున్నా ఇంకా వారిని వెనకేసుకొస్తున్న చంద్రబాబు కూడా నీతి, నిజాయితీ గురించి లెక్షర్లు ఇస్తుండటమే విచిత్రం. ఒకవైపు వందలు, వేల కోట్లు మోసాలు చేస్తు మరోవైపు సేవ్ డెమక్రసీ అంటూ సుజనా చౌదరి లాంటి వాళ్ళు బోర్డులు పట్టుకుని పార్లమెంటు ఎదుటే ధర్నాలు చేయటమే విడ్డూరంగా ఉంది. అందుకనే బ్యాంకులను మోసం చేసే టిడిపి నేతలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: