తెలుగుదేశంపార్టీలో కాంగ్రెస్ తరహా పూర్తి ప్రజాస్వామ్యం వచ్చేసినట్లుంది. ఎవరికి వారుగా సీట్లను ప్రకటించేసుకుంటుంటే కర్నూలు మాత్రం ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ ఓటమికి రంగం సిద్ధం చేసినట్లు నేతలు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. తాజాగా నంద్యాల  ఫిరాయింపు ఎంపి ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి అభ్యర్ధి అయితేనే గెలుస్తాడని చెప్పటం విచిత్రంగా ఉంది.  నంద్యాలలో ప్రస్తుతం అఖిల సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డే ఎంఎల్ఏ. అయినా ఏవికే టిక్కెట్టివ్వాలని ఫిరాయింపు ఎంపి చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. సిఎం తనను నంద్యాల అసెంబ్లీ టిక్కెట్టు విషయంలో అభిప్రాయం అడిగితే ఏవి సుబ్బారెడ్డికే ఇవ్వాలని చెబుతానని చెప్పేశారు.

 

ఇక ఆళ్ళగడ్డ గురించి ఏవి మాట్లాడుతూ అక్కడ మంత్రి గెలవదని పరోక్షంగానే చెప్పారు. తాను అయితే నంద్యాల లేకపోతే ఆళ్ళగడ్డ నుండి పోటీ చేయటం ఖాయమని కూడా ఏవి చెబుతున్నారు. ఆళ్ళగడ్డలో తానైతేనే గెలుస్తానని కూడా చెప్పటంతో అఖిలకు మండిపోతోంది. కానీ ఏం చేయలేక కూర్చున్నది. చూడబోతే భూమా కుటుంబానికి వ్యతిరేకంగా టిడిపిలో శక్తులన్నీ ఏకమవుతున్నాయి. కాకపోతే కొందరు బయట పడుతున్నారు. మరి కొందరు తెరవెనుక నుండి వ్యతిరేకిస్తున్నారు.  

 

రెండు నియోజకవర్గాల్లో పరిస్ధితిని చూస్తుంటే రేపటి ఎన్నికల్లో భూమా అఖిల, బ్రహ్మానందరెడ్డి పోటీ చేసినా గెలిచే పరిస్ధితి అయితే కనిపించటం లేదు. ఎందుకంటే నియోజకవర్గాల్లో వారిద్దరికి మద్దతిచ్చే వారికన్నా వ్యతిరేకులే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది.  భూమా కుటుంబానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో పడదు. కెఇ కుటుంబంతో పొసగదు. ఏవిసుబ్బారెడ్డితో అయితే ఉప్పు, నిప్పులాంటి పరిస్ధితి. ఎస్పీవై రెడ్డి కూడా పూర్తి వ్యతిరేకమే. అందురు కలిసి తలోచెయ్యి వేస్తే ఇంకెక్కడ గెలుస్తారు ? అందుకనే అందరూ కలిసి అసలు వాళ్ళిద్దరికీ టిక్కెట్లే ఇప్పించకూడదని కంకణం కట్టుకున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: