చంద్రబాబునాయుడు ఇరకాటంలో పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ కేటాయింపులో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.  రాబోయే ఎన్నికల్లో జగ్గంపేట అసెంబ్లీ టికెట్ తన భార్యకే కేటాయించాలని  కాకినాడ ఎంపి తోట నర్సింహం డిమాండ్ పెట్టటంతోనే తలనొప్పులు మొదలయ్యాయి. ప్రస్తుతం జగ్గంపేటలో వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

 

అనారోగ్యం కారణంగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ చంద్రబాబుతో భేటీ సందర్భంగా తోట స్పష్టం చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చేసిన డిమాండ్ తోనే చంద్రబాబు దిమ్మ తిరిగింది. కాకినాడ లోక్ సభ పరిధిలోకి వచ్చే జగ్గంపేట అసెంబ్లీలో తన భార్యకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయటంతో తూర్పు గోదావరి జిల్లాలో కలకలం మొదలైంది.

 

రాబోయే ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేయటానికి జ్యోతుల మళ్ళీ రెడీ అవుతున్న సమయంలో హఠాత్తుగా తోట అడ్డం పడుతున్నారు. ఎప్పుడైతే జగ్గంపేట టికెట్ పై తోట కన్నుపడిందో అప్పటి నుండి జ్యోతులలో టెన్షన్ మొదలైంది. దాంతో వెంటనే అమరావతికి వచ్చి చంద్రబాబుతో జ్యోతుల టికెట్ విషయంలో భేటీ అయ్యారు. సరే వారిమధ్య ఏం జరిగిందన్నది బయటకు రాలేదు.

 

మొత్తానికి ఇక్కడ సమస్య ఏమిటంటే, రెండుసార్లు గతంలో తాను ఇక్కడి నుండే గెలిచాను కాబట్టి తనకు నియోజకవర్గంలో పట్టుందని తోట అంటున్నారు. అదే సమయంలో జ్యోతులైతే గెలవరని కూడా జోస్యం చెప్పేశారు.  తోట భార్యకు టికెట్ ఇస్తే జ్యోతుల ఎలా రియాక్టవుతారో తెలీదు. అలాగని జ్యోతులకే టికెట్ ఇస్తే తోట ఏం చేస్తారో తెలీదు పైగా జ్యోతుల గెలిచేంత వరకూ అనుమానమే. ఈ పరిస్ధితుల్లో పై ఇద్దరి నేతల మధ్య చంద్రబాబు బాగానే ఇరకాటంలో పడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: