చంద్రబాబునాయుడుపై సినీ
నటి సుమలత చేసిన కామెంట్స్ షాకింగ్ గా ఉన్నాయి. కర్నాటకలోని మాండ్య పార్లమెంటు
నియోజకవర్గంలో సుమలత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే సుమలతకు వ్యతిరేకంగా మండ్య పార్లమెంటు
సీటులో పోటీ చేస్తున్న జేడి అభ్యర్ధి నిఖిల్ గౌడ కు మద్దతుగా చంద్రబాబు ప్రచారం
చేస్తున్నారు.
గతంలో జరిగిన ఓ ఎన్నికల్లో కూడా చంద్రబాబు కోరిక మేరకు దివంగత నటుడు, సుమలత భర్త, కేంద్ర మాజీ మంత్రి అంబరీష్ ఏపిలో టిడిపి అభ్యర్ధులకు ప్రచారం చేసిన విషయాన్ని సినీనటుడు మోహన్ బాబు గుర్తు చేసిన విషయం తెలిసిందే. విచిత్రమేమిటంటే ఇదే సుమలత గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో అనగాని సత్యప్రసాద్ కు మద్దతుగా ప్రచారం చేశారట.
అంటే ఒకవైపు సుమలత టిడిపి అభ్యర్ధికి ప్రచారం చేస్తే ఇదే సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు మాండ్యకు వెళ్ళి మరీ ప్రచారం చేసి వచ్చారన్నమాట. అదే విషయాన్ని సుమలత మాట్లాడుతూ చంద్రబాబుకు వెన్నుపోటు కొత్తేమీ కాదన్నారు. చంద్రబాబును పచ్చి అవకాశవాదిగా కామెంట్ చేశారు. మేలు చేసిన వారిని కాటు వేయటం చంద్రబాబుకు అలవాటే అంటూ మండిపడ్డారు సుమలత.
మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తనకు వెన్నుపోటు పొడవటం పెద్దద వింతేమీ కాదంటూ మండిపడ్డారు. చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడిచినా అదృష్ట వశాత్తు బిజెపి మద్దతు లభించిందని సుమలత చెప్పారు. తెలుగు మహిళలకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అంటు సుమలత నిలదీయటంలో ఎంతైనా వాస్తవం ఉంది కదా ?